మలబార్‌ యుద్ధ విన్యాసాలు ప్రారంభం

Malabar war stunts started in Japan on 10th November - Sakshi

15 వరకు జపాన్‌ వేదికగా నిర్వహణ

భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నౌకాదళాల హాజరు

భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కమోర్తా, శివాలిక్‌ యుద్ధ నౌకలు

సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక 30వ మలబార్‌ యుద్ధ విన్యాసాలు జపాన్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. జపాన్‌లోని యెకొసోకు సాగరతీరంలో ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్న యుద్ధ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు పాల్గొంటున్నాయి. ఇండో–పసిఫిక్‌ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్‌ నేవిగేషన్‌ వ్యవస్థలను పరిరక్షించడంతోపాటు ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం చైనా కుటిల ప్రయత్నాలకు చెక్‌ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా భారత నౌకాదళంతోపాటు యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీ (యూఎస్‌ఎన్‌), జపాన్‌ మారిటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (జేఎంఎస్‌డీఎఫ్‌), రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ(ఆర్‌ఏఎన్‌) నౌకాదళం సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి.

ఇందులో భాగంగా యాంటీ సబ్‌ మెరైన్‌ వార్‌ఫేర్‌ ఆపరేషన్స్, క్రాస్‌డెక్‌ ల్యాండింగ్స్, సీమ్యాన్‌ షిప్‌ విన్యాసాలు ప్రదర్శిస్తాయి. భారతదేశం తరఫున ఐఎన్‌ఎస్‌ కమోర్తా, ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌ యుద్ధ నౌకలు, మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లతోపాటు మెరైన్‌ కమాండోలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

భారత నౌకాదళ ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండ్‌ రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా, యూఎస్‌ఏ నేవీ కమాండర్‌ వైస్‌ అడ్మిరల్‌ కార్ల్‌ థామస్, ఆస్ట్రేలియా ఫ్లీట్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ జోనాథన్, జపాన్‌ ఫ్లీట్‌ కమాండర్‌ వైస్‌ అడ్మిరల్‌ యూసా హెడికీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు.

ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఓపెన్‌ ఫ్రీగా మార్చాలన్నదే మలబార్‌ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని ఆయా దేశాల ప్రతినిధులు ప్రకటించారు. క్వాడ్‌ దేశాలతో (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) పాటు మలబార్‌లోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని వెల్లడించారు.

భారత్‌–అమెరికాతో మొదలు...
ఇండో–పసిఫిక్‌ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్‌ నేవిగేషన్‌ వ్యవస్థల పరిరక్షణ కోసం భారత్‌–అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా 1992లో మలబార్‌ విన్యాసాలు ప్రారంభించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెండు దేశాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు కొనసాగిస్తున్నాయి.

ఈ రెండు దేశాలతో 2015లో జపాన్‌ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. 2020లో రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ చేరడంతో ప్రస్తుతం నాలుగు దేశాల నౌకాదళాలు కలిసి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top