‘పొదుపు’ పబ్లిసిటీకే.. | Lokesh leaves for Puttaparthi on special flight immediately after cabinet meeting | Sakshi
Sakshi News home page

‘పొదుపు’ పబ్లిసిటీకే..

May 15 2026 5:06 AM | Updated on May 15 2026 5:59 AM

Lokesh leaves for Puttaparthi on special flight immediately after cabinet meeting

ప్రత్యేక విమానంలో వచ్చిన లోకేశ్‌కు స్వాగతం పలికిన నాయకులు

కేబినెట్‌ సమావేశమైన వెంటనే ప్రత్యేక ఫ్లైట్‌లో పుట్టపర్తికి లోకేశ్‌ 

కాన్వాయ్‌ తగ్గించుకున్నానంటూనే మరింత దుబారా 

సీఎం తనయుడు, మంత్రి లోకేశ్‌ తీరుపై విమర్శలు

సాక్షి, అమరావతి : ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఉంది  మంత్రి లోకేశ్‌ తీరు. పొదుపు మంత్రం ఎదుటి వారికే తప్ప తనకు కాదని ఆయన నిరూపించారు. తన వాహన కాన్వాయ్‌ తగ్గించుకుంటున్నానని గురువారం మీడియాలో తెగ పబ్లిసిటీ చేసుకున్న కొద్దిసేపటికే ఆయన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లడం గమనార్హం. ఒకవైపు సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించుకోవాలని.. డీజిల్, పెట్రోల్‌ వాహనాల బదులు ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడాలని హడావుడి చేసి ఆయన మాత్రం అత్యంత ఖర్చుతో ప్రత్యేక విమానాన్ని వినియోగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.  

సీఎం చెప్పిన కొద్దిసేపటికే.. 
వెలగపూడిలో గురువారం ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలు పొదుపు పాటించాలని, ఉద్యోగులు సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారు. కానీ, లోకేశ్‌ బయటకొచ్చి ప్రత్యేక విమానాన్ని ఉపయోగించడం ఏమిటని పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కేబినెట్‌ సమావేశం తర్వాత తాను వినియోగిస్తున్న ప్రత్యేక విమానం (వీటీ–సీవీబీ)లో లోకేశ్‌ బయల్దేరి పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. అక్కడి పర్యటనలో నేతలు భారీగా వాహనాలు ఉపయోగించి హడావుడి చేశారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి భారీ సంఖ్యలో వాహనాలతో ధర్మవరం వెళ్లారు.   

23 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో దుబారా.. 
ఇక చంద్రబాబు ప్రభుత్వంలో 23 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాధనం దుబారా జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎం తనయుడు ప్రత్యేక విమానాల్లో తరచూ విదేశీ పర్యటనలు చేయడం, అమరావతి నుంచి హైదరాబాద్‌కి విడివిడిగా నిత్యం వెళ్లడం సర్వసాధారణమైంది. మంత్రులు కూడా అదేబాటలో పయనిస్తూ జిల్లాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు. ఇటీవలే తొమ్మిది మంది మంత్రులు, పదుల సంఖ్యలో అధికారులు సింగపూర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం అనధికారికంగా ఎస్కార్ట్‌ వాహనాలు వినియోగిస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు పొదుపు చర్యలు ప్రకటించినా ఆచరణలో మాత్రం విచ్చలవిడిగా దుబారా జరుగుతోంది.

 లోకేశ్‌ సింగపూర్‌ ప్రయాణ ఖర్చు రూ.7.82 లక్షలు ఈ నెల 11న జరిగిన జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశానికి సింగపూర్‌ వెళ్లిన ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ విదేశీ ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.7.82 లక్షలకు పరిపాలన అనుమతిస్తూ ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం నివాస బంగ్లాకు రూ.6.50 కోట్లతో ఆధునిక హంగులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement