పదోన్నతి పొందిన వారితో సహా మొత్తం 72 మందికి స్థానచలనం
పోస్టింగ్‌లిచ్చిన హైకోర్టు
ప్రకాశం ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా సత్యానంద్
విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జిగా తేజోవతి
వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా రామచంద్రుడు
విశాఖ సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా చక్రపాణి
ఈ నెల 7లోపు కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. ఇటీవల సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) నుంచి అదనపు జిల్లా జడ్జిలుగా పదోన్నతులు పొందిన వారితో సహా మొత్తం 72 మందికి స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. వీరందరికీ హైకోర్టు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది. మే 7వ తేదీ లోపు కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.
రిలీవ్ అయ్యే లోపు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న తీర్పులను వెలువరించాలని కూడా స్పష్టం చేసింది. విజయవాడ రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న ఎ.సత్యానంద్ ప్రకాశం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. అత్యంత కీలకమైన విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఎల్.తేజోవతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు మూడో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్నారు.
విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఉన్న పి.భాస్కరరావు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం 12వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా టి.రామచంద్రుడు నియమితులయ్యారు. గుంటూరు అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా ఉన్న జి.చక్రపాణి విశాఖపట్నం సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా నియమితులయ్యారు. నెల్లూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న జి.గీత, నెల్లూరు ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా బదిలీ అయ్యారు. విజయవాడ కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కె.రాధారత్నం నియమితులయ్యారు.


