వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..

Kurnool: Hair Donation for Cancer Patients, How to Donate Your Hair - Sakshi

క్యాన్సర్‌ బాధితుల కోసం కేశదానం

పిల్లలు, స్త్రీలు, పురుషుల దాతృత్వం

సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యం

సేకరించిన కురులు విగ్గుల తయారీకి వినియోగం

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): తలపై జుట్టు ప్రతి ఒక్కరికీ ఎంతో అపురూపం. ఒక్క వెంట్రుక రాలిపోతున్నా ఎంతో మనోవేదనకు గురవుతారు. అలాంటిది క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చే చికిత్సలో తల వెంట్రుకలు మొత్తం పోతే వారి బాధ వర్ణణాతీతం. అలాంటి వారి కోసం మేమున్నామంటూ.. పిల్లల నుంచి పెద్దల వరకు ముందుకు వస్తున్నారు. వారి కోసం కేశాలు దానం చేసి విగ్గుల తయారీకి సహకరిస్తున్నారు.

ఇటీవల కర్నూలులో నిర్వహించిన కేశదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. క్యాన్సర్‌ బారిన పడిన వారికి కీమోథెరపి ఇవ్వడం కారణంగా వారి తలవెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి గుండు ఏర్పడుతుంది. ఇలాంటి వారికి తలవెంట్రుకలు తిరిగి రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వైపు క్యాన్సర్‌ మహమ్మారి నుంచి వేదన మరోవైపు ఎంతో అపురూపంగా చూసుకున్న తలవెంట్రుకలు పోయి అందవిహీనంగా మారామనే మనోవేదన వారిని తీవ్రంగా కలిచివేస్తుంది. ఇలాంటి వారికి ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇచ్చేందుకు ముంబయిలోని నోవా హాస్పిటల్‌ వారు ఇతోధికంగా సేవలు అందిస్తున్నారు. దాతల ద్వారా వారికి అందిన వెంట్రుకలను విగ్గులుగా మార్చి కీమోథెరపి ద్వారా వెంట్రుకలు కోల్పోయిన వారికి అందజేస్తున్నారు.
   

కేశదానానికి విశేష స్పందన 
యువభారత్‌ సేవా సమితి ఆధ్వర్యంలో రాయలసీమలో మొదటిసారి గత నెల 29వ తేదీన నిర్వహించిన కేశదానం, రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కేశదానానికి ముందుగా 25 మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా 49 మంది మహిళలు, యువతులు, పిల్లలతో పాటు నలుగురు యువకులు కేశదానానికి ముందుకు వచ్చారు. స్థానిక దేవిఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నలుగురు యువకులు క్యాన్సర్‌ బాధితుల కోసమే వెంట్రుకలను 15 సెం.మీ. కంటే ఎక్కువగా పెంచి మరీ కేశదానం చేశారు. నంద్యాల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకటహరీష్‌ అనే యువకుడు ఇప్పటికే రెండుసార్లు కేశదానం చేశారు. ఈ కార్యక్రమంపై యువభారత్‌ సేవా సమితి వారు నెలరోజుల ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందులో అధికంగా మహిళలు భాగస్వామ్యమయ్యేలా చేశారు.   


ఎంతో తృప్తినిస్తోంది 

క్యాన్సర్‌ బాధితుల కోసం చేసే కేశదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదట భావించినప్పుడు అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. క్రమంగా కార్యక్రమం ఉద్దేశాన్ని అందరికీ చెప్పి ఒప్పించాం. అనూహ్యంగా 53 మంది తరలివచ్చి కేశ దానం చేయడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నేను కూడా కేశదానం చేశాను. ఇప్పటికే 22 సార్లు రక్తదానం కూడా చేశాను. ఎవ్వరైనా కేశదానం చేయాలనుకుంటే హైదరాబాద్‌లోని కోట సంపత్‌కుమార్‌ (9992345678, 93463445)కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే చాలు ఏర్పాట్లు చేస్తారు.  –సి. రేణుక, యువభారత్‌ సేవా సమితి సహాయ కార్యదర్శి, కర్నూలు 

​​​​​​​
నేనూ దానం చేశా 

క్యాన్సర్‌ బాధితుల కోసమని కేశదానం చేస్తున్నారని తెలిసి అక్క వారితో కలిసి నేనూ వెళ్లాను. అక్కడ ఆంటీలు, అక్కలు వారి వెంట్రుకలను కత్తిరిస్తూ ఉంటే ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా. క్యాన్సర్‌ బాధితుల కోసం విగ్గులు తయారు చేసి ఉచితంగా ఇస్తారని చెప్పడంతో నేను కూడా నా వెంట్రుకలను కత్తిరించి వారికి ఇచ్చాను. నాతో పాటు నా స్నేహితులు సైతం ఇచ్చారు.   
– సి. శ్రీమహి, కర్నూలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top