సాగర్‌ను పరిశీలించిన కృష్ణాబోర్డు సబ్‌ కమిటీ

Krishna Board Sub-Committee examining Nagarjunasagar for review officials two states - Sakshi

నేడు రెండు రాష్ట్రాల అధికారులతో సమీక్ష

సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్‌ నుంచి నేరుగా నీటిని వాడుకునేలా ప్రాజెక్టుల నిర్వహణపై అధ్యయనం కోసం ఆర్కే పిళ్లై నేతృత్వంలోని కృష్ణాబోర్డు సబ్‌ కమిటీ సోమవారం సాగర్‌ను పరిశీలించింది. కుడికాలువ హెడ్‌ రెగ్యులేటర్, విద్యుత్‌ కేంద్రం, సాగర్‌ స్పిల్‌వే, ప్రధాన విద్యుత్‌ కేంద్రాలను చూసింది. మంగళవారం సాగర్‌ ఎడమకాలువ హెడ్‌ రెగ్యులేటర్, విద్యుత్‌ కేంద్రం, ఏఎమ్మార్పీ, హైదరాబాద్‌ తాగునీటి పథకం, సాగర్‌ వరద కాలువలను పరిశీలించి.. రెండు రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులతో సమావేశమవుతుంది. సాగర్‌ ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ (నిర్వహణ నియమావళి) ముసాయిదా నివేదికను రూపొందించి బోర్డుకు అందజేయనుంది.

కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లను బోర్డు తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు ఆ రాష్ట్ర సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకున్నప్పుడే తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని షరతు విధిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రాజెక్టులను బోర్డు ఆధీనంలోకి తీసుకోలేకపోయింది.

ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునేలోగా శ్రీశైలం, సాగర్‌ ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ రూపొందించేందుకు బోర్డు సబ్‌ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే గతనెల 25, 26 తేదీల్లో శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నేరుగా నీటిని వాడుకునే ఎడమ విద్యుత్‌ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల సందర్శనకు సబ్‌ కమిటీని తెలంగాణ సర్కార్‌ అనుమతించలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top