రెడ్డి రాజుల కోట.. అభివృద్ధి బాట

Kondaveeti fort attracts tourists - Sakshi

పర్యాటకులను ఆకట్టుకుంటున్న కొండవీటి కోట

రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు

పురాతన ఆలయాలు, కొండపై సహజసిద్ధ చెరువుల అభివృద్ధి 

లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పనులు పూర్తి

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రకృతి అద్దిన సహజ సోయగాలతో అలరారుతున్న కొండవీటి కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ కోటను అభివృద్ధి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని కొండలపై దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కొండవీటి కోటకు 650 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కొండచుట్టూ ఎత్తైన రాతి గోడలు, కొండ కింద మట్టి గోడ, కోటపై కట్టడాలు, గోపీనాథపురంలో కత్తుల బావి, మూడు వైపులా దర్వాజాలు, బురుజులు, ఆలయాలు, మసీదు, చెరువులు, ఔషధ మొక్కలు ఇలా ఎన్నో కొండవీటి కోటపై ఉన్నాయి. కోటను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.
 
అడుగడుగునా అభివృద్ధి
కోట ప్రవేశ ద్వారాన్ని చెట్టు మాదిరిగా అటూ ఇటూ బురుజులతో మధ్యలో పులి బొమ్మతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన కోటను వేరుచేస్తూ కిలోమీటర్‌ మేర కంచె వేస్తున్నారు. కోటలోని చెరువును లోటస్‌ పాండ్‌ మాదిరిగా రూపొందిస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం పనులు తుది దశకు చేరాయి. విగ్రహాన్ని టీడీడీ సిద్ధం చేసింది. ఓపెస్‌ ఎయిర్‌ థియేటర్, చిన్న పిల్లలకు వినోదం పంచేందుకు వీలుగా పార్క్‌ను సిద్ధం చేశారు. 2.5 కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. పుట్టలమ్మ, ముత్యాలమ్మ (కూనలమ్మ), వెదుళ్ల చెరువులను అభివృద్ధి చేశారు. చెరువు గట్లకు రివిట్‌మెంట్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
కోట లోపల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 

చెరువులో బోటింగ్‌
కోట లోపల చెరువులో పెడల్‌ బోటింగ్, పాత గెస్ట్‌ హౌస్‌ను పడగొట్టి ఎన్విరాన్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ ఏడు ఆలయాలు, రెండు మసీదులు ఉన్నాయి. పశ్చిమ వైపు నుంచి 400 మీటర్ల మెట్ల నిర్మాణం చేపట్టాల్సింది. పుట్టకోట బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి రూ.40లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. పార్కింగ్‌ ఏరియాను ఇప్పటికే అభివృద్ధి చేశారు. కోట అభివృద్ధికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌  ప్రత్యేక చొరవ చూపారు. ఎమ్మెల్యే విడదల రజని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోట అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top