గూఢచర్యం కేసులో కీలక నిందితుడు అరెస్టు | Key suspect arrested in espionage case | Sakshi
Sakshi News home page

గూఢచర్యం కేసులో కీలక నిందితుడు అరెస్టు

Oct 15 2026 3:10 AM | Updated on Oct 15 2026 3:10 AM

Key suspect arrested in espionage case

ఫేస్‌బుక్‌ పరిచయంతో విదేశీ మహిళకు నౌకాదళ సమాచారం  

2025లో కేసు నమోదుతో సౌదీ అరేబియాకు పరార్‌ 

ఏడాది తర్వాత భారత్‌కు తిరిగిరావడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌

సాక్షి, అమరావతి: నౌకాదళానికి చెందిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని విదేశీ వ్యక్తులకు చేరవేసిన కేసులో పరారైన మరో నిందితుడు కె. శ్రీనివాస్‌ పోలీసులకు చిక్కినట్లు ఏపీ డీజీపీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023లో ఫేస్‌బుక్‌ ద్వారా ‘ఏంజెల్‌ పాయల్‌’ అనే పేరుతో పరిచయమైన గుర్తుతెలియని మహిళతో బొంగు రవి పరిచయం పెంచుకున్నాడు. తాను దుబాయ్‌లోని ఓ షిప్పింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నానని.. నౌకలు, సిబ్బందికి సంబంధించిన లాజిస్టిక్స్‌ వ్యవహారాలు చూస్తుంటానని ఆమె నమ్మించింది. 

ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న మహిళ విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌యార్డులో ఉన్న నౌకలు, జలాంతర్గాముల వివరాలను పంపితే డబ్బులిస్తానని రవిని ప్రలోభ పెట్టింది. దీంతో రవి, శ్రీనివాస్‌ ఇద్దరూ కలిసి డాక్‌యార్డులో ఉన్న నౌకలు, జలాంతర్గాముల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని ఆమెకు చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకు ప్రతిఫలంగా రవి బ్యాంకు ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం.. ఆ మొత్తంలో శ్రీనివాస్‌కు వాటా చెల్లించినట్లు పేర్కొన్నారు. 

దీనిపై విశాఖ మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో 2025 అక్టోబర్‌ 12న ఈ గూఢచర్యం కేసు నమోదైంది. నేవల్‌ డాక్‌యార్డులో పనిచేస్తున్న రవిని అరెస్టుచేయగా శ్రీనివాస్‌ పరారీలో ఉన్నాడు. అయితే, ఈనెల 11న శ్రీనివాస్‌ సౌదీ అరేబియా నుంచి భారత్‌కు తిరిగి వస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా సంస్థల సమన్వయంతో విశాఖపట్నం సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement