నెల్లూరు: టీడీపీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌తోపాటు అతని కుటుంబం కలిసి దుశ్శానపర్వానికి తెగించిన వైనం కావలి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార మదంతో టీడీపీ నేతలు బరితెగించారు. కుమారుడి ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ గిరిజన (ఎరుకుల సామాజిక వర్గం) మహిళను వివస్త్ర చేసి జుట్టు పట్టుకుని కాళ్లతో, చేతులతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగితే.. ఈ కేసును తొక్కిపెట్టిన పోలీసులు వారం తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కేసు కావలి రెండో పట్టణ పోలీసులు క్రైం నంబర్‌గా 38/2026 నమోదు చేశారు.
విశ్వసనీయంగా సేకరించిన సమాచారం మేరకు.. కావలి కచ్చేరిమిట్టకు చెందిన ఓ గిరిజన మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె కుమారుడు అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువతితో ప్రేమాణయం సాగిస్తున్నాడని తెలుసుకుని ఆమే.. కొద్ది రోజుల క్రితం స్థానిక టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీంకు తెలియజేసింది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో షర్మిల, సిరాజ్, కమల్, బీబ్జాన్, మల్లికాతోపాటు మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి వివస్త్ర చేసి కాళ్లతో, చేతులతో కొట్టారు.
దాదాపు అర్ధగంటకుపైగా చుట్టు పక్కల జనం చూస్తుండగానే ఈ దారుణానికి తెగించారు. ‘ఎరుకుల లం.. నిన్ను చంపేసి సూసైడ్ అయిని రాయిస్తే.. నీకు దిక్కెవరు’ అంటూ విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆమె వారి నుంచి తప్పించుకుని తన మానాన్ని కాపాడుకునేందుకు చేతులు అడ్డు పెట్టుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగిన తర్వాత సమాచారం అందుకున్న కావలి రెండో పట్టణ సీఐ గిరిబాబు, ఎస్సై గోపీనాథ్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని విచారించారు. అదే రోజు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నప్పటికీ.. కేసు నమోదు చేయలేదు.
నీరుగార్చేందుకే వారం తర్వాత కేసు నమోదు
అయితే ఈ ఘటనకు సంబంధించి స్థానికులు కొందరు వీడియోలు తీశారు. నిందితులు ఈ విషయం బయటకు వెల్లడిస్తే ఎవరినైనా చంపేస్తామంటూ బెదిరించారు. స్థానికులు వీడియోలు తీసినప్పటికీ బయట పెట్టేందుకు ఎవరూ సాహించలేదు. దీంతో ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించడంతో బయటకు పొక్కకుండా ఉండిపోయింది. బాధితురాలు సైతం రహస్య ప్రాంతంలో చికిత్స పొందుతోంది. అయితే ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు వారం తర్వాత కేసు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి శారీరకంగా గాయపరిచి, పరువుకు భంగం కలిగించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కలిగించారనే సెక్షన్లతో స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ వై. శ్యామ్‌కుమార్‌తో కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు డీఎస్పీ పరిధిలో ఉంటుంది. నిందితులు టీడీపీ నేతలు కావడంతో ఈ ఘటన జరిగిన రోజే సీఐ గిరిబాబు, ఎస్సై గోపీనాథ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించినప్పటికీ అప్పుడే ఫిర్యాదు స్వీకరించినప్పటికీ కేసు నమోదు చేయకుండా, వారం తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించి, హెడ్‌కానిస్టేబుల్ పేరుతో ఆలస్యంగా కేసు నమోదు చేయడం, ఇది ఫాల్స్ కేసుగా కొట్టిపారేసేందుకు అనే వాదన పోలీస్ వర్గాల నుంచి వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా నిందితురాలు షరి్మల స్నానం చేస్తుండగా సదరు గిరిజన మహిళ కుమారుడు చూశాడంటూ అదే సమయంలో కౌంటర్ కేసును నమోదు చేయడం గమనార్హం.


