ఈ ఏడాది 312 జాబ్‌ మేళాలు

Job Mela Calendar released by APSSDC - Sakshi

ప్రతి శుక్రవారం జాబ్‌ మేళా డే 

ప్రతి మంగళవారం ప్లేస్‌మెంట్‌ డే 

జాబ్‌ మేళా క్యాలెండర్‌ విడుదల చేసిన ఏపీఎస్‌ఎస్‌డీసీ 

సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్‌ మేళాలు నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రకటించింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్‌ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, చైర్మన్‌ అజయ్‌రెడ్డి, జాబ్‌ మేళా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రతి మంగళవారం ప్లేస్‌మెంట్‌ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా 262 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, గడిచిన మూడేళ్లలో 14 లక్షల మందికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గం పరిధిలో స్కిల్‌హబ్స్‌ ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా తొలి విడతలో 66 హబ్స్‌ను ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ అజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top