JEE Main Exam: జేఈఈ మెయిన్‌.. ఇక రెండుసార్లే

JEE Main Exam Will Be Conducted Twice Year - Sakshi

కరోనా సమయంలో నాలుగుసార్లు నిర్వహణ

సాక్షి, అమరావతి: ఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించనుంది. గతంలో కరోనా సమయంలో నాలుగుసార్లు నిర్వహించిన ఎన్టీఏను ఏటా అలాగే అవకాశం కల్పించాలని విద్యార్థుల నుంచి డిమాండ్‌ ఉన్నా కేవలం రెండుసార్లు మాత్రమే ఈ పరీక్షను చేపట్టాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో.. 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్ష షెడ్యూళ్లను వచ్చే వారం విడుదల చేయనుంది. బోర్డుల పరీక్షలతో సమస్య రాకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలతో కూడా ఎన్టీఏ సంప్రదిస్తోంది. బోర్డు పరీక్షలు, జేఈఈ పరీక్షలు ఒకే తేదీల్లో కాకుండా వేర్వేరుగా కొంత వ్యవధిలో నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కరోనా వేళలో నాలుగుసార్లు నిర్వహణ
గతంలో జేఈఈ మెయిన్‌ను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండగా 2019 నుంచి రెండుసార్లకు పెంచారు. ఒకే దఫా కారణంగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారని భావించి ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌ నెలల్లో నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా సమయంలో పరీక్షలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో 2021లో మెయిన్‌ను నాలుగు దఫాలుగా నిర్వహించారు. విద్యార్థులు ఈ నాలుగు దఫాల్లో దేనిలోనైనా పాల్గొని జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా అవకాశమిచ్చారు. 2022లో కూడా రెండుసార్లే నిర్వహించినా అవి చాలా ఆలస్యం కావడం, బోర్డు పరీక్షల సమయంలో వాటిని నిర్వహించేలా ముందు షెడ్యూళ్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది.

పైగా.. కరోనా అనంతరం రెగ్యులర్‌ తరగతులు ఆ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభమైనందున తాము మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరారు. అయితే, జనవరి, ఏప్రిల్‌ మాసాల్లో నిర్వహించాల్సిన ఆ పరీక్షలు జూన్, జూలైకు వాయిదా పడడం, ఫలితాల విడుదల కూడా చాలా జాప్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యమైంది.

ఈ నేపథ్యంలో.. విద్యాసంవత్సరం నష్టపోకుండా కొనసాగాలంటే ఇకపై జనవరి, ఏప్రిల్‌ మాసాల్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించి అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ముందుకెళ్లేలా ప్రవేశ పరీక్షలను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఎన్టీఏ భావిస్తోంది. అందుకనుగుణంగా ఇంటర్మీడియెట్‌ బోర్డులు, సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూళ్లకు ఇబ్బంది రాకుండా చూసేందుకు ఎన్టీఏ  కసరత్తు చేస్తోందని వివిధ కోచింగ్‌ సంస్థల అధ్యాపకులు చెబుతున్నారు.

ఏటా 10 లక్షలకు పైగా అభ్యర్థులు..
మరోవైపు.. జేఈఈ పరీక్షలకు ఏటా పది లక్షల మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్‌ అవుతున్నారు. ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించి మెరిట్‌లో ఉన్న టాప్‌ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తున్నారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2019లో అత్యధికంగా 12.37 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు రిజిస్టరయ్యారు.
చదవండి: సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top