AP: సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..

Reservation For Home Guards In Constable Posts In AP - Sakshi

కానిస్టేబుల్‌ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్‌ 

సాక్షి, అమరావతి:  హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్,  కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్‌ – ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్‌ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు.

సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, ఫిట్టర్‌ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్‌ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్‌ పోస్టులే భర్తీ చేస్తారు. కాబట్టి ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్‌ నియామకాల్లో కేటగిరీలవారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం.

ఈమేరకు ‘ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రూల్స్‌ 1999’కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి కానిస్టేబుల్‌ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్న తరుణంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివల్ల రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది.  

హోంగార్డులకు ముఖ్యమంత్రి వరం
హోంగార్డులకు ప్రయోజనం కలిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తగిన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పని చేస్తున్నప్పటికీ పోలీసు శాఖలో హోంగార్డులు తగిన గుర్తింపునకు నోచుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోంగార్డుల జీతాలు పెంచింది. అప్పటివరకు నెలకు రూ.18 వేలు మాత్రమే ఉన్న హోంగార్డుల జీతాన్ని రూ.21,300కి పెంచుతూ 2019 అక్టోబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పుడు వారికి మరింత మేలు చేకూరుస్తూ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోలీసు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. అంతకంటే ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం వారికి వరంగా మారనుంది.
చదవండి: ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్‌ గేమ్‌.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top