AP: శాసన మండలిలో ఇద్దరు విప్‌ల నియామకం

సాక్షి, అమరావతి: శాసన మండలిలో ఇద్దరు విప్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమిస్తూ సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులిచ్చారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తా: జంగా కృష్ణమూర్తి
దాచేపల్లి: శాసన మండలిలో ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పని చేస్తానని మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. గామాలపాడు సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా తనను నియమించటంపై కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు. (క్లిక్: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు)
తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా డొక్కా
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావును తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. (క్లిక్: గుంటూరులో బీజేపీకి బిగ్ షాక్)