బాబోయ్‌ జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషనా..!

Jaggareddy Gudam Police Station Means Police Officers Are Scared - Sakshi

బెంబేలెత్తుతున్న అధికారులు, సిబ్బంది

స్వల్పకాలంలోనే బదిలీలు

వాస్తులోపం అని పలువురు చర్చ 

పోలీసు అధికారులందరూ జంగారెడ్డిగూడెం స్టేషన్‌ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఇక్కడికి వస్తే కొద్దికాలానికే టాటా చెప్పేయాల్సి వస్తుందని బెంబేలెత్తుతున్నారు. ఇక్కడ పనిచేసిన సిబ్బందికి వేటు పడటం, స్వల్పకాలంలోనే బదిలీ అవుతుండటం దీనికి ఊతమిస్తోంది.

జంగారెడ్డిగూడెం: అయ్యబాబోయ్‌ జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషనా..! ఇదీ కొత్తగా ఇక్కడకు రావాలంటే అధికారుల పరిస్థితి. ఈ ఠాణాకు వచ్చిన ఏ అధికారి కూడా పట్టుమని ఏడా ది కూడా పనిచేయట్లేదు. అసలు ఈ పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది?. ఇది ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పై చర్చ. ఇక్కడకు వచ్చిన అధికారి పూర్తి కాలం కూడా పనిచేయడం లేదు. మధ్యలో ఒకరిద్దరు పనిచేసినా మిగిలిన వారంతా వివిధ కారణాలతో బదిలీ అయ్యారు. దీంతో జంగారెడ్డిగూడెంలో పనిచేయాలంటేనే అధికారులు భయపడుతున్నారు. (చదవండి: ఊరు ఒకటే.. పంచాయతీలు రెండు)

ఈనేపథ్యంలో జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసలు జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది! పోలీస్‌స్టేషన్‌కు వాస్తు లోపం ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.  పోలీస్‌స్టేషన్‌ నిర్మించిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉందని ప్రజలు, సిబ్బంది చర్చించుకుంటున్నా రు. 2007 నుంచి 13 ఏళ్లలో 14 బదిలీలు జరిగాయి. ఇందులో కొన్ని చాలా చిన్న కారణాలతో జరగడం గమనార్హం.

పోలీస్‌స్టేషన్‌కు వాస్తుదోషం ఉందని ఈ ప్రాంతవాసులు అనుమానిస్తున్నారు. వాస్తదోషమో లేక గ్రహస్థితో తెలియదుగానీ ఇక్కడకు వచ్చిన తక్కువ కాలంలో పలువురు సస్పెండ్‌ కావడం లేదా బదిలీ అవడం జరిగిపోతోంది. ఇక్కడ పనిచేసే అధికారులు అనతికాలంలోనే బదిలీపై వెళ్లడంతో, కొత్త గా ఈ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేందుకు చాలా మంది వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. కొంతమంది బదిలీపైనా వెళితే.. మరికొందరు సస్పెన్షన్‌ గురికావడం, ఇంకొందరు చిన్న కారణాలకే వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది.   

ఇవిగో నిదర్శనాలు
2007లో సీఐ ఎం.వెంకటేశ్వరరావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు. ఒక మహిళ కేసు విషయంలో వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణం.
2008 జనవరిలో సీఐ చింతా రాంబాబు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మరణించడంతో వీరిపై వేటు పడింది. 
తెలంగాణ నుంచి ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఐదునెలల తర్వాత ఓ కేసు నమోదు విషయంలో జాప్యం చేశారని ఆయనను సస్పెండ్‌ చేశారు.
ఆ తరువాత ఎస్సైగా వచ్చిన ఏఎన్‌ఎన్‌ మూర్తిని 2009 మేలో వీఆర్‌కు, తరువాత సస్పెన్షన్‌కు గురయ్యారు.
2014 జనవరిలో వచ్చిన ఎస్సై సీహెచ్‌ రామచంద్రరా వు, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కారణం.
2016లో ఎస్సై ఆనందరెడ్డి ఏడాదిన్నర పనిచేసి వీఆర్‌కు వెళ్లారు.
2016 అక్టోబర్‌లో వచ్చిన ఎస్సై ఎం.కేశవరావు 10 నెలలకే వీఆర్‌కు, అక్కడి నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.
2017 సెప్టెంబర్‌లో ఎస్సైగా వచ్చిన జీజే విష్ణువర్దన్‌ 9 నెలలు పనిచేసి వీఆర్‌కు వెళ్లారు. 
2018 జూలైలో వచ్చిన ఎస్సై అల్లు దుర్గారావు కూడా వీఆర్‌కు వెళ్లారు.
ఈ ఏడాది మార్చిలో ఎస్సై ఎస్‌ఎస్‌ఆర్‌ గంగాధర్‌ స్వల్పకాలంలోనే ఆరోపణలతో తాజాగా వీఆర్‌కు వెళ్లారు. ఈయనతో పాటు సీఐ బీఎన్‌ నాయక్‌ను కూడా ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top