ఆరోగ్యశ్రీతో క్యాన్సర్‌ను జయించా

Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

ఆరోగ్యశ్రీతో క్యాన్సర్‌ను జయించా
నా పేరు బొప్పా నాగలక్ష్మి, నా భర్త శ్రీనివాస్‌. తాపీ పనిచేస్తారు. మాది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామం. నాకు 2022లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చింది. గుంటూరులోని క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా రేడియేషన్, కీమోథెరపీ చేశారు. ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స కూడా చేశారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయ్యింది. పూర్తిగా ప్రభుత్వమే భరించింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. పూర్తిగా కోలుకున్నాను. ఇటీవల నా భర్త శ్రీనివాస్‌ ప్రమాదవశాత్తు పడిపోవడంతో కాలు విరిగింది.

ప్లేట్లు వేశారు. ఆ తర్వాత ప్లేట్లు కూడా తీసేశారు. ప్రస్తుతం ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు వైఎస్సార్‌ చేయూత పథకంలో మూడుసార్లు ఏడాదికి రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందింది. వైఎస్సార్‌ ఆసరాలో ఏడాదికి రూ.16 వేల చొప్పున మూడుసార్లు నా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి. సున్నా వడ్డీ కింద ఏడాదికి రూ.2 వేల చొప్పున అందింది. నవరత్నాల పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. నాకు ఇద్దరు సంతానం. ఇద్దరికీ వివాహాలు చేశాను.     – బొప్పా నాగలక్ష్మి, పూలపల్లి  (కె.శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్‌)

వృద్ధాప్యంలో పింఛనే ఆధారం
మాది పేద కుటుంబం. నా భర్త చాలా కాలం క్రితం మృతి చెందారు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ వివాహం చేశాను. ఎవరి కుటుంబాలను వారు పోషించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే నాకు వితంతు పింఛన్‌ మంజూరైంది. ఇప్పుడు రూ.3 వేలు ఇస్తున్నారు. వృద్ధాప్యంలో ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగ­పడుతోంది. మాది అనకాపల్లి జిల్లా మునగపాక మండల కేంద్రం.

సొంతిల్లు లేకపోవడంతో దరఖాస్తు చేసిన వెంటనే ఇల్లు మంజూరైంది. ఇప్పుడు సొంతింట్లోనే ఉంటున్నాను. ఉపాధి హామీ పథకంలో కూలి పనులకు కూడా వెళుతుంటాను. నా లాంటి వృద్ధులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద కొడుకులా ఆదరిస్తు­న్నారు. నాకు వచ్చే పింఛన్‌ను కుటుంబ అవస­రాలు, మందులకు వినియోగించుకుంటున్నా. పొద్దు పొడవక ముందే ప్రతి నెలా ఒకటో తారీఖునే వలంటీర్‌ వచ్చి పింఛన్‌ అందజే­యడం సంతోషంగా ఉంది. – గుదే పార్వతి, మునగపాక (వెలగా జగదీష్‌కుమార్, విలేకరి, మునగపాక)

ఈ మేలును జీవితాంతం మరవం
భార్యాభర్తలిద్దరం పని చేస్తేగానీ పూట గడవని కుటుంబం మాది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారింది. మాది వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని హనుమాన్‌నగర్‌. నా భర్త తిరుమలేశు ఇక్కడే ఓ వస్త్ర దుకాణంలో గుమస్తాగా పని చేసేవాడు. నేను భాగ్యలక్ష్మి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. మా సంఘం రూ.10 లక్షలు రుణం తీసుకుంది. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్‌ ఆసరా ద్వారా ఆ రుణం నాలుగు విడతల్లో మాఫీ అయింది. గతంలో మేము మగ్గం నేసేవాళ్లం. అప్పుడు వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున మూడేళ్లు రూ.72 వేలు అందుకున్నాం.

కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాక చేనేత వృత్తిని వీడి, ప్రస్తుతం ఇంటి వద్ద బియ్యం వ్యాపారం చేస్తున్నాం. మా అమ్మాయి కళావతి బీటెక్‌ పూర్తి చేసి, ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు మూడేళ్లపాటు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా రూ.లక్షకు పైగా లబ్ధి చేకూరింది. కుమారుడు జయకృష్ణకు ఇంటర్లో అమ్మఒడి ద్వారా రూ.30 వేలు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం బీటెక్‌ డేటా సైన్స్‌లో చేరాడు. గతంలో మా ప్రాంతానికి తాగునీరు వచ్చేది కాదు. ఇప్పుడు రోజూ ఇంటి వద్దకే నీటి సరఫరా జరుగుతోంది. జగనన్న  పాలనలో మా కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. దిగుల్లేదిక. ఈ ప్రభుత్వం మేలును జీవితాంతం గుర్తుంచుకుంటాం.    – తనికంటి లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు (కుడుముల వీరారెడ్డి, విలేకరి, ప్రొద్దుటూరు)
 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top