అండగా ఉంటాం | Jagan assures Rashids family members | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం

Jul 20 2024 3:27 AM | Updated on Jul 20 2024 9:11 AM

Jagan assures Rashids family members

దోషులకు శిక్ష పడేలా చేద్దాం 

ఏ కష్టం వచ్చినా వెంట ఉంటాం 

ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదు  

రషీద్‌ కుటుంబ సభ్యులకు జగన్‌ భరోసా  

సాక్షి ప్రతినిధి, గుంటూరు: మీ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రషీద్‌ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం గూండాల చేతిలో రషీద్‌ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వినుకొండకు రోడ్డు మార్గంలో వచ్చిన ఆయన సాయంత్రం ఐదున్నర గంటలకు రషీద్‌ నివాసానికి చేరుకున్నారు. రషీద్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రషీద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రషీద్‌ సోదరుడు ఖాదర్‌.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హత్య జరిగిన తీరును సెల్‌ఫోన్‌లో చూపించి వివరించారు. 

తన సోదరుడు వైఎస్సార్‌సీపీలో పని చేస్తున్నాడని కక్షతోనే హత్య చేయించారని, ఈ హత్య వెనుక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉన్నారని చెప్పారు. రషీద్‌ తల్లి బడేబీ మాట్లాడుతూ.. తన కుమారుడు తన పనేంటో తాను చూసుకునే వాడని, ఎలాంటి గొడవలకు వెళ్లడన్నారు. ఎమ్మెల్యే మనుషులు తన కొడుకును టార్గెట్‌ చేసి హత్య చేయించారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. జిలానీ.. రషీద్‌ను అన్నా అని పిలుస్తుంటాడని, కేవలం రాజకీయ కక్షతోనే నరికి చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మద్యం షాపులో సూపర్‌వైజర్‌గా చేస్తున్న తన తమ్ముడు ఎనిమిది గంటలకు షాపు క్లోజ్‌ చేస్తాడని, ఆ సమయంలో నిందితుడు వెనుక నుంచి వచ్చి హత్య చేశాడని ఖాదర్‌ వివరించాడు.

దీనిపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ ‘చంపుకునేంత కక్షలు లేవు.. ఎందుకలా జరిగింది.. రాష్ట్రమంతా అతలాకుతలంగా మారింది.. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు.. మన ఊళ్లల్లో మనం ఉండేందుకు కూడా వీలు లేకుండా పోయింది. మన ఎమ్మెల్యేలపై కూడా రాళ్లు వేయించిన పరిస్థితి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. మన కన్నా ఎక్కువ చేస్తామని చెప్పి, నాలుగింతలు ఎక్కువ మేలు చేస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అమ్మ ఒడి ఇస్తానన్నాడు. అమ్మ ఒడి పడిందా..  మోసం చేశారు. రైతు భరోసా, సున్నా వడ్డీ.. ఇవన్నీ పడలేదు. తప్పు చేయకపోయినప్పటికీ తప్పు చేసినట్లు చూపిస్తారు.. రషీద్‌ హత్యకు సంబంధించి దోషులకు తప్పకుండా శిక్ష పడేలా చేద్దాం. 

మీకు ఎలాంటి కష్టం వచ్చినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టించినా నేరుగా హైకోర్టులో కేసు వేసి, అన్ని రకాలుగా అండగా ఉంటాం. న్యాయం జరిగేలా చూస్తాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటాం. చేస్తే మంచి చేయాలి. ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వెంట నేనుంటాను’ అని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

ఈ పర్యటనలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, కోన రఘుపతి, అన్నాబత్తుని శివకుమార్, కాసు మహే‹Ùరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు బలసాని కిరణ్‌కుమార్, షేక్‌ నూరీఫాతిమా తదితరులు పాల్గొన్నారు.  

రాజకీయ ప్రమేయంతోనే రషీద్‌ హత్య 
పోలీసుల తీరుపై మండిపడుతున్న కుటుంబ సభ్యులు 
సాక్షి, గుంటూరు : వ్యక్తిగత కక్షల వల్లే రషీద్‌ హత్య జరిగిందని పోలీసులు చెబుతుండటంపై మృతుడి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పక్కా పథకం ప్రకారం తమ కుమారుడిని స్థానిక నాయకుల ప్రోద్బలంతో హత్య చేశారన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రషీద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చే ముందు రషీద్‌ తల్లిదండ్రులు బడేబీ, పరేషాలు మీడియాతో  మాట్లాడారు. హత్యలో రాజకీయ కోణం లేకపోతే గతంలోనే హత్య చేయాలి కదా.. అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే హత్య జరగడం రాజకీయం కాక మరేంటని నిలదీశారు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement