International Nurses Day: ఎనలేని సేవకు ప్రతిరూపం

International Nurses Day: Guntur Government General Hospital Nurses Interview - Sakshi

ఓర్పు, త్యాగానికి నిలువెత్తు ప్రతీక

మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

దేవుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని అంటారు.. అనారోగ్యంపాలై.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ కన్నా మిన్నగా చూసే నర్సునూ సృష్టించాడంటే అతిశయోక్తి కాదు.. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి  రోగులకు పునర్జన్మనిచ్చిన ఆ అమృతమూర్తులకు నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా వందనం.. అభివందనం.  

గుంటూరు మెడికల్‌: అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరి చేరని రోజులివీ.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ.. ఆస్పత్రి బెడ్‌పై కాలిన, కుళ్లిన గాయాలతో, దుర్గంధం వెదజల్లే శరీరభాగాలతో ఉన్న స్థితిలో ఎవరైనా ఆ రోగివైపు కన్నెత్తి చూస్తారా? కానీ ఆ స్థితిలోనూ అతనితో ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో సకల సేవలూ చేసే నర్సులు దేవతలతో సమానం. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. జీవితాంతం కృతజ్ఞత చూపించడం తప్ప.   

ఈ రోజే ఎందుకంటే.. 
రెండో ప్రపంచ యుద్ధకాలంలో గాయపడిన సైనికులకు విశేష సేవలందించిన నర్సు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పుట్టిన రోజు మే 12న. అందుకే ఏటా ఆ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు.   


నర్సింగ్‌ పోస్టుల భర్తీకి సీఎం ప్రాధాన్యం  

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని టీచింగ్‌ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేశారు. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఏఎన్‌ఎంలు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో జీఎన్‌ఎం నర్సులను నియమించారు. గ్రామాల్లోనూ బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారిని మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లుగా నియమించారు. 200 మందికి ఇన్‌ సర్వీస్‌ కోటాలో జీఎన్‌ఎం కోర్సును అభ్యసించే అవకాశం కల్పించారు. గుంటూరు జీజీహెచ్‌లో ఒకే సారి  250 స్టాఫ్‌నర్సు  పోస్టులను మంజూరు చేశారు.  

అమ్మ కూడా నర్సే  
అమ్మ సముద్రాదేవి స్టాఫ్‌నర్సుగా గుంటూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించారు. ఆమెతోపాటు అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చేదానిని. ఆమె స్ఫూర్తితో నేనూ ఈ వృత్తిలోకి వచ్చా. హైదరాబాద్‌లో 2000లో జీఎన్‌ఎం కోర్సును పూర్తి చేశా. ప్రభుత్వ నర్సుగా ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్‌ డిచ్‌పల్లిలో. 22 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. రోగులకు సేవలందించడం సంతృప్తినిస్తోంది.  
– చిలువూరి కిరణ్మయి, గ్రేడ్‌–2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌  


డాక్టర్‌ కావాలనుకున్నా..  

డాక్టర్‌ కావాలనుకున్నా.. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అందుకే నర్సునయ్యా. 22 ఏళ్లుగా పనిచేస్తున్నా. కోవిడ్‌ సమయంలో చేసిన సేవలకు ఉన్నతాధికారులు  వచ్చి అభినందించడం మరిచిపోలేని అనుభూతి.   
– పొట్లూరు మంజు,  జీజీహెచ్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ (గ్రేడ్‌–2) 


అమ్మ కోరిక మేరకు..  

అమ్మ కోరిక మేరకు నర్సింగ్‌ వృత్తిలోకి ప్రవేశించాను.  39 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఎక్కువగా పసికందులకు చికిత్స అందించే ఎన్‌ఐసీయూలో పనిచేశాను. చికిత్స అనంతరం పిల్లలు వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు చేతులు జోడించి చూపే కృతజ్ఞతతో పడిన కష్టమంతా మరిచిపోతాను.   
– షేక్‌ సమీనా, జీజీహెచ్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ (గ్రేడ్‌–2)  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top