
బండబూతులు.. దుర్భాషలతో వేధింపులు
తాకరాని చోట తనిఖీలు
ప్రశ్నించిన వారిని పని నుంచి తొలగిస్తున్నారు
తెనాలిలో రోడ్డుపై బైఠాయించి మహిళా శానిటేషన్ వర్కర్ల నిరసన
చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఓ వర్కర్ ఆవేదన
తెనాలి: బండ బూతులు తిడుతూ అన్నం తింటున్నారా..పెం.. తింటున్నారా..! అంటూ గుంటూరు జిల్లా తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా శానిటేషన్ వర్కర్లపై ఇన్‌చార్జి విజయసారథి సాగిస్తున్న దాష్టీకమిది.. సెల్‌ఫోన్లు దాచుకున్నారని యూనిఫామ్ చొక్కా విప్పించి ఒళ్లంతా తడుముతూ తనిఖీ చేయించటం. అదేమంటే జాకెట్ కూడా విప్పమన్నాగా.. విప్పలేదా! అని వెకిలిగా వ్యాఖ్యానిస్తూ పైశాచికానందం పొందడం ఆయన నైజమని మహిళా వర్కర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.
విజయసారథి వ్యవహారశైలిపై విసిగిపోయిన వారు గురువారం తెనాలి తల్లీపిల్లల వైద్యశాల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కులాలవారీగా మహిళా వర్కర్లను వర్గీకరించి దళిత మహిళలను బూతులు తిడుతున్నారని తెలిపారు. డ్యూటీకి రాగానే అందరి ఫోన్లను ఆఫీసు రూంలో పెట్టిస్తున్నారని, ఆ తర్వాత మహిళా ఉద్యోగి చేత వర్కర్ల యూనిఫాం షర్ట్ విప్పించి తాకరాని చోట తాకుతూ తనిఖీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయం ప్రశ్నిస్తే లంగాలు, జాకెట్లూ విప్పదీయించి వెతకమన్నానుగా.. చేయట్లేదా అని అడుగుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నా.. ’నన్ను కదిలించేవాడు ఎవడూ లేడు, ఏమైనా చేసుకోండి’ అంటూ మాట్లాడాడని వివరించారు. ఎవ రైనా ప్రశ్నిస్తే పని నుంచి తొలగిస్తున్నాడని వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించాడని, తనను విధుల్లోకి తీసుకోకుంటే ఇన్‌చార్జి గది ఎదుటే ఆత్మహత్యకు పాల్పడతానని ఒక వర్కర్ స్పష్టం చేశారు.