పెళ్లింట పెను విషాదం | Incident in Visakhapatnam district | Sakshi
Sakshi News home page

పెళ్లింట పెను విషాదం

May 15 2026 6:12 AM | Updated on May 15 2026 6:12 AM

Incident in Visakhapatnam district

పుట్టింటికి వస్తుండగా ప్రమాదంలో నవ వధువు మృతి 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తల్లి కూడా... 

విశాఖ జిల్లాలో ఘటన

అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే, నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ హృదయవిదారక ఘటన  విశాఖ జిల్లా అగనంపూడి ఉక్కు జనరల్‌ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపు­రుపల్లి పంచాయతీలో క్లాప్‌ వ్యాన్‌ డ్రైవర్‌.

ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడ­చీపు­రుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడు­పు­­తున్నాడు. 

మరికొద్ది­సేపట్లో ఇంటికి చేరిపోతా­రనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్‌ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్‌ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement