
నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో మిగిలిన సీట్లకు ఈనెల 17న రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన విద్యార్థులకు సమాచారం పంపించామన్నారు. ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు ఇడుపులపాయకు నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైక విద్యార్థులు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలన్నారు. ఎన్‌సీసీ, క్రీడా కోటాకు సంబంధించిన ఎంపిక జాబితా సంబంధిత అధికారుల నుంచి రావాల్సి ఉందని తెలిపారు.
నేటి నుంచి ట్రిపుల్‌ఐటీల్లో పీయూసీ తరగతులు
నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సోమవారం నుంచి పీయూసీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. నూజివీడుతో కలిపి మొత్తం పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు 3,300 మంది అవుతున్నారు. పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు ఇంత మంది ఒకే క్యాంపస్‌లో ఉండటం ఇదే తొలిసారి. దీంతో మున్ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని ట్రిపుల్‌ఐటీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుండడం గమనార్హం.