విశాఖ బహిరంగ సభ: జన కెరటాలు

Huge Public Attend For PM Narendra Modi Public Meeting Visakha - Sakshi

ప్రధాని బహిరంగ సభకు పోటెత్తిన జన వాహిని 

ఉత్తరాంధ్ర నలువైపుల నుంచి భారీగా రాక 

సభా ప్రాంగణంలో 3 లక్షల మందికి ఏర్పాట్లు 

దారిలో నిలిచిపోయిన లక్షలాది మంది  

6 వేల బస్సులు, 12 వేల ఆటోల్లో ఏయూ క్యాంపస్‌కు 

జై జగన్‌.. జై విశాఖ నినాదాలతో ప్రజాహోరు 

ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసిన యంత్రాంగం  

సాక్షి, విశాఖపట్నం:  సాగర ఘోషను మించి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిధ్వనించింది. నగరంలోకి వచ్చిన ప్రతి బస్సు, ఆటో, బైక్‌.. అన్నీ ఏయూ మైదానం వైపే కదిలాయి. సీఎం, పీఎం నినాదాలతో సాగర తీరం హోరెత్తింది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం విశాఖ వచ్చిన ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే వేదికపై కనిపించి తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అధికార యంత్రాంగం సమర్థంగా ఏర్పాట్లు చేసింది. 

తెల్లవారుజామునే.. 
విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బహిరంగసభ నిర్వహించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జన సమీకరణ చేపట్టింది. సుమారు 3 లక్షల మందికి సభాస్థలిలో ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణం పూర్తిగా నిండిపోగా లక్షలాది మంది దారిలోనే నిలిచిపోయారు. అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి నుంచి కూడా తరలి వచ్చారు.

వేకువ జామున 4 గంటల నుంచే ప్రయాణమై విశాఖ చేరుకున్నారు. 6 గంటల నుంచే సభాస్థలికి రావడం మొదలైంది. ఉదయం 9 గంటలకే సభా ప్రాంగణంలో సీట్లు నిండిపోయాయి. తర్వాత వచ్చిన వారంతా ప్రాంగణానికి ఇరువైపులా నిలుచుని సభ ముగిసేవరకూ ఓపిగ్గా నిరీక్షించడం విశేషం. 6 వేలకు పైగా బస్సులు, 15 వేల పైచిలుకు ఇతర వాహనాల్లో జనం ప్రభంజనంలా తరలివచ్చారు. 
బహిరంగ సభ గ్రౌండ్‌లో కిక్కిరిసిపోయిన జనం  

సీఎం రాకతో హోరెత్తిన ఏయూ.. 
ఉదయం 9.40 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకోవడంతో సీఎం.. సీఎం.. జై జగన్‌ నినాదాలతో మార్మోగింది. లక్షలాది గొంతులు ఏకమై ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడంతో ఏయూ క్యాంపస్‌ హోరెత్తింది.

అనంతరం ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ ఆత్మీయంగా స్వాగతం పలికారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తారని ప్రకటించిన వెంటనే జై జగన్‌.. జై విశాఖ నినాదాలతో హోరెత్తింది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపూ ప్రజలు హర్షధ్వానాలతో ప్రతిస్పందించారు. 

అర్ధరాత్రి నుంచే అల్పాహారం..  
సభకు తరలి రావడం నుంచి తిరిగి వెళ్లే వరకూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సిద్ధం చేసిన అల్పాహారాన్ని వేకువ జామున 2 గంటలకే 158 పాయింట్ల వద్దకు తరలించి వస్తున్న ప్రతి ఒక్కరికీ అందజేశారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలోనే ప్రతి ఒక్కరికీ భోజన పార్శిళ్లను కూడా అందజేశారు.

లక్షల లీటర్ల మంచినీరు, వేలాది మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆద్యంతం ఎక్కడికీ కదలకుండా చివరి వరకూ ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 6,700 మంది పోలీసులు గట్టి భద్రతా కల్పించారు. మూడంచెల భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేశారు. అధికారులు పూర్తి సమన్వయంతో వ్యవహరించి భారీ బహిరంగ సభను విజయవంతం చేశారు. 
సభా ప్రాంగణం వెలుపల రోడ్లన్నీ ఇలా జన ప్రవాహంతో నిండిపోయాయి.. 

ప్రధానికి ఘన వీడ్కోలు 
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): రెండు రోజుల పర్యటన ముగించుకుని శనివారం మధ్యాహ్నం విశాఖ నుంచి తిరుగు పయనమైన ప్రధాని మోదీకి రాష్ట్ర అధికార యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, తూర్పు నావికాదళం కమాండ్‌ ఇన్‌ చీఫ్‌ ప్లాగ్‌ అధికారి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా, విశాఖ జేసీ విశ్వనాథ్‌ తదితరులు ప్రధానికి వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ ఏయూలోని సభా స్థలం నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా ఐఎన్‌ఎస్‌ డేగాకు 11.26 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 11.56 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరారు. 

విశాఖ సభ సైడ్‌ లైట్స్‌.. 
► ప్రియమైన సోదరీ సోదరులారా నమస్కారం... గవర్నర్‌ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సహచర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నమస్కారం..’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ....భారత్‌ మాతాకీ జై అంటూ అందరితో నినాదాలు చేయించి తన ప్రసంగాన్ని తెలుగులోనే ముగించారు.  

► విశాఖను విశేష నగరంగా ప్రధాని అభివర్ణించడంలో సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది.  

► రైల్వే మంత్రి కూడా తన ప్రసంగాన్ని అందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రారంభించారు.  

► ఉదయం 9.40 గంటలకు పోర్టు గెస్ట్‌ హౌస్‌ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ చోళ సూట్‌ నుంచి ప్రధాని మోదీ రోడ్డు మార్గంలోనే ఏయూ మైదానానికి వచ్చారు.  
► భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నట్లు అంచనా వేసిన అధికార యంత్రాంగం అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసింది. మొత్తం 3 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనూ ప్రజలు భారీగా తరలి వస్తుండటం విశేషం.  
► సభ ముగిసిన తరువాత ప్రధాని, ముఖ్యమంత్రి వేదిక నుంచి దిగుతున్న సమయంలోనూ వేల మంది వస్తుండటం కనిపించింది. అప్పటికే కార్యక్రమం ముగిసిందని పోలీసులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.  

► సీఎం జగన్‌ 10 నిమిషాల పాటు మాట్లాడగా ప్రధాని మోదీ 25 నిమిషాలకుపైగా ప్రసంగించారు.  

► ప్రధానిని శాలువాతో సత్కరించి శ్రీరాముడి విగ్రహాన్ని సీఎం అందజేశారు.  

► ప్రధాని ప్రారంభించనున్న ప్రాజెక్టులకు సంబంధించిన ‘ఏవీ’ని ప్రదర్శించారు.  

► సభా ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వేర్వేరు హెలికాప్టర్లలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.  

► ప్రధాని మోదీ 11.26కి ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి ప్రత్యేక విమానంలో 11.56కి హైదరాబాద్‌ పయనమయ్యారు.  

► ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు విమానాశ్రయానికి చేరుకొని 12.20కి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు.  

► వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్‌ మల్లికార్జున, పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్‌ రాజబాబు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, మేయర్‌ హరివెంకటకుమారి తదితరులు ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు.  
    – సాక్షి నెట్‌వర్క్‌    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top