మెడకు ఉరికంటా బిగుసుకుపోయిన తాళ్లు.. లాలించి, బుజ్జగించి

Home Guard Helps Psychological Disorder Woman Bobbili Vizianagaram - Sakshi

మానవత్వం పరిమళించిన వేళ...

లాలించి... పాలించి ప్రాణాపాయం నుంచి తప్పించి

మతిస్థిమితం లేని మహిళకు సేవలందించిన హోంగార్డు

ఆమె మతి స్థిమితం లేని మహిళ... ఎవరికీ పట్టని వ్యక్తి... పట్టణంలో తిరుగుతూ రోడ్డు పక్కన దొరికిన గుడ్డ పీలికలను, తాళ్లను మెడలో వేసుకొనే ఓ మతి చలించిన మనస్తత్వం. అటువంటి వ్యక్తి ఎదురుపడితే ఎవరైనా ఏమి చేస్తారు... ఛీత్కరిస్తూ అల్లంత దూరానికి పారిపోయే వాళ్లే ఎక్కువ. కానీ ఈ హోంగార్డు అక్కున చేర్చుకుంది. ఆమెకు  సేవలందించి తన మంచి మనసును చాటుకుంది. 

బొబ్బిలి: కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమో మరే కారణమో తెలియదు కానీ.. ఓ మహిళ చిన్న సంచి పట్టుకుని పట్టణంలో తిరుగుతూ తనలో తనే ఏవో పాటలు పాడుకుంటుంది. మాటలాడిస్తే మాట కలుపుతుంది. పట్టణంలోని అన్ని బజార్లలో ఇటూ అటూ తిరుగుతూ తనలో తానే గొణుక్కుంటూ కనిపించిన తాళ్లు, దారాలన్నీ మెడలో వేసుకుంటుంది. ఆ తాళ్లు మెడకు ఉరిలా దగ్గరికంటా బిగుసుకున్నాయి. అటుగా వెళ్తున్న హోంగార్డు ఝాన్సీ రాణి కంట ఈమె పడింది. అయ్యో అనుకుంటూ కొందరి సాయంతో ఆమెను బుజ్జగిస్తూ చిన్నపాటి చాకుతో మెడలోని ఒక్కో పోగూ కత్తిరించింది.

ఆ తర్వాత నువ్వేం చదువుకున్నావంటే ఆరో తరగతనీ, నీ పేరేంటంటే జయలక్ష్మి అనీ చెప్పింది. ఇలా మాటల్లో పెట్టి  మొత్తం తన మెడ చుట్టూ చుట్టుకున్న తాళ్లన్నీ తొలగించింది. అనంతరం ఓ నైటీ తీసుకువచ్చి ఆమెకు ధరింపజేసింది. ఆ తరువాత కడుపునిండా భోజనం పెట్టి తన మంచి మనసును చాటుకుంది. ‘మన కుటుంబ సభ్యులైతే ఇలా సపర్యలు చేయమా ... నాకు మాత్రం ఈమె ఓ తల్లి, ఓ అత్తమ్మ’లా అనిపించిందని ఆ హోం గార్డు చెప్పడం తన పెద్ద మనసుకు నిదర్శనం. ఆమెకు సపర్యలు చేయడం పట్ల పలువురు ఝాన్సీరాణిని అభినందనల్లో ముంచెత్తారు.

చదవండి: బాలల కోసం బహువిధ రక్షణ
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top