
యజమాని నమ్మకాన్ని వమ్ము చేశాడు.. అతని భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు
ఆపై మృతదేహంతో లైంగిక చర్య
ఇలాంటి వారికి బెయిల్ ఇస్తే అది సమాజంపై దుష్ప్రభావం చూపుతుంది
నిందితుని బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: కామవాంఛతో యజమాని భార్యను కిరాతకంగా చంపడమే కాకుండా, ఆ తరువాత ఆమె మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మృతురాలిపట్ల పిటిషనర్ పాశవికంగా, మృగంలా ప్రవర్తించాడని హైకోర్టు తెలిపింది. ఇలాంటి వారికి బెయిల్ మంజూరుచేస్తే అది సమాజంపై దు్రష్పభావం చూపుతుందని స్పష్టంచేసింది.
‘యజమాని భార్యను హత్యచేయడం ద్వారా అతని నమ్మకాన్ని పిటిషనర్ దారుణంగా వమ్ముచేశాడు. కాంపౌండర్‌గా తన ఇంట్లోనే ఉండేందుకు యజమాని స్థానం కల్పించాడు. విశ్వాసంగా ఉంటూ ఇంట్లో ఒకరిగా నమ్మకం కలిగించి పిటిషనర్ ఈ నేరానికి ఒడిగట్టాడు. కామవాంఛతో రగిలిపోయి మృతురాలిపట్ల ఓ మృగంలా ప్రవర్తించాడు. తన వాంఛను తిరస్కరించడంతో ఆమె తలపై అతిదారుణంగా, విచక్షణారహితంగా కొట్టి చంపాడు.
హత్య అనంతరం కూడా అతని క్రూరత్వం ఏమాత్రం ఆగలేదు. మృతదేహంతో లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఇంతటి తీవ్రమైన చర్యలకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదు. చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన ఆరోపణల తీవ్రత ఎంతమాత్రం తగ్గదు’.. అని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల తీర్పు వెలువరించారు.
బంధువని ఆశ్రయమిస్తే..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన తండ్రితో కలిసి గత 16 ఏళ్లుగా ఫిస్టులా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ తన భార్య అర్పితా బిశ్వాస్, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఉంటున్నారు. తన దూరపు బంధువైన నయన్ బిశ్వాస్‌కు శ్రీకాంత్ తన ఆసుపత్రిలో కాంపౌండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. 2024 డిసెంబరు 31న న్యూఇయర్ వేడుకల్లో భాగంగా శ్రీకాంత్, నయన్, మరో బంధువు కలిసి మద్యం తాగారు. అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లి నిద్రపోయారు.
నయన్ బిస్వాస్ హాలులో నిద్రపోయాడు. తెల్లవారి శ్రీకాంత్ లేచి చూసేసరికి అర్పిత ఇంట్లో లేదు. ఆమె గది నిండా రక్తం ఉంది. ఆమె కోసం వెతకగా, ఇంటికి సమీపంలో మురికికాలువలో తలపై తీవ్రగాయాలతో చనిపోయి నగ్నంగా కనిపించింది. దీంతో కావలి పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికి అర్పితపట్ల నయన్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ఎదురుతిరగడంతో ఎక్కడ నిజం బయటకు చెప్పేస్తుందోనన్న కారణంతో ఆమెను చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బెయిల్ పిటిషన్లు కొట్టివేత..
నిందితుడు నయన్ బిశ్వాస్ నెల్లూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టేసింది. ఆ తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు ఇటీవల విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నయన్ బిశ్వాస్‌కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరిస్తూ అతని పిటిషన్‌ను కొట్టేశారు.