
ముందే వచ్చి.. ముందే వెళ్లిన నైరుతి
సాధారణ వర్షపాతం నమోదైనా అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
ఈశాన్య రుతుపవనాల వల్ల వచ్చే 2 నెలలు అధిక వర్షాలు
తుపానుల భయం.. పంటలకు క్లిష్ట పరిస్థితి
సాక్షి, అమరావతి: ఈ నెల 16వ తేదీ నాటికి ఈశాన్య రుతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ ఏడాది ముందే వచ్చిన నైరుతి రుతుపవనాలు ముందే నిష్క్రమించడంతో ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి మార్గం ఏర్పడింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు అక్టోబర్ మూడో వారం వరకూ కొనసాగుతాయి.
కానీ.. ఈసారి నిష్క్రమణ ప్రక్రియ ముందే ప్రారంభమై దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వైదొలగాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తయినా కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం వల్ల కోస్తాంధ్రలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.
సాధారణ వర్షపాతమే
నైరుతి సీజన్‌లో ఎక్కువ వర్షాలు కురిసినట్టు కనిపించినా అది సాధారణం కంటే ఎక్కువగా లేదు. జూన్ నుంచి సెపె్టంబర్ వరకూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 515 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా.. ఈ సీజన్‌లో 530.9 మిల్లీమీటర్లుగా నమోదైంది.
రుతుపవనాలు మే 26న ముందుగానే వచ్చినా జూన్, జూలైల్లో వర్షాలు తక్కువగా పడ్డాయి. మొదట 31 శాతం లోటు నమోదైంది. జూలై చివరి నాటికి ఇది 24 శాతానికి తగ్గింది. ఆగస్టులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల వల్ల వర్షాలు పెరిగాయి. ఆగస్టులో సాధారణం కన్నా 39 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో పడిన భారీ వర్షాలతో లోటు వర్షపాతం భర్తీ అయ్యింది.
తుపానులకు అవకాశం
ఈశాన్య రుతుపవనాల వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. ఈసారి వీటివల్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లానినొ పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అలాగే బంగాళాఖాతంలో ఈ నెల 22, 23 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈశాన్య రుతుపవనాలను మరింత చురుగ్గా మార్చే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడటానికి అనువైన పరిస్థితులున్నాయి.

నైరుతి రుతుపవనాలు సమయం కన్నా ముందే ప్రారంభమై, ముందే ముగియడంతో అకాల వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆగస్టులో పడిన భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ లో నైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో వచ్చిన అధిక వర్షాలు పడి పలు ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలను దెబ్బతీశాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల వరి నాట్లు దెబ్బతిన్నాయి. పంటలకు తెగుళ్లు కూడా సోకాయి. పంటలలో తేమ శాతం పెరిగి దిగుబడి తగ్గింది.