Andhra Pradesh: ముంచెత్తిన కుండపోత

Heavy Rains In Andhra Pradesh - Sakshi

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

లోతట్టు ప్రాంతాలు జలమయం.. నీట మునిగిన పంట పొలాలు

విరిగిపడ్డ చెట్లు, కొండ చరియలు.. తిరుమల ఘాట్‌ రోడ్లు మూసివేత

నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు.. వైవీయూ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా 

మైపాడు వద్ద సముద్రంలో చిక్కుకున్న 12 మంది మత్స్యకారులు 

వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతంలో జోరు వాన

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు 

సాక్షి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు/సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేని వర్షం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. జోరువానకు తోడు గాలి బీభత్సం సృష్టించడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాలపై వర్ష ప్రభావం అధికంగా కనిపించింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏర్పేడు మండలంలోని గుడిమల్లం–పాపానాయుడుపేట మధ్య ఉన్న సీతకాలువలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి.

నారాయణవనం మండలంలోని అరుణానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కేవీబీపురం మండలంలోని పలు ప్రాంతాలు  జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాళంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోలీస్, రెవెన్యూ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారు. పుత్తూరు మండలంలోని నేసనూరు, గోపాలకృష్ణాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరణియార్‌ రిజర్వాయర్‌ వద్ద ఎమర్జెన్సీ గేట్లు ఎత్తివేయడంతో ఆ ప్రాంతాన్ని హై అలర్ట్‌గా ప్రకటించారు. దిగువ ప్రాంతాల్లోని గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. చంద్రగిరి మండలంలోని చంద్రగిరి – నాగయ్యగారిపల్లె మార్గంలో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వరదయ్యపాళెం మండంలోని పాముల కాలువపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,700 ఎకరాల్లో వరి, టమాట, కూరగాయలు, పూలతోటలు నీట మునిగాయి. అధికారులు ప్రతి సచివాలయ పరిధిలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 

తిరుమలలో పొంగిపొర్లుతున్న ఐదు డ్యామ్‌లు
తిరుమలలో గురువారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షంతో ఘాట్‌ రోడ్డులో, శ్రీవారి పాదాలు, పాపవినాశనం, ఎంబీసీ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్‌ రోడ్డులోని రెండో మలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎంబీసీ వద్ద ఓ చెట్టు విరిగి పడటంతో జలప్రసాదం ప్లాంట్‌ ధ్వంసమైంది. గాలిగోపురం వద్ద చెట్టు కూలి మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితిలో రెండు ఘాట్‌ రోడ్లు, పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మూసి వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. విరిగి పడిన కొండచరియలు, చెట్లను తొలగించేందుకు టీటీడీ ఆటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎఫ్‌ఓ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తిరుమాడవీధులు, శ్రీవారి ఆలయం ఎదుట నీరు భారీగా ప్రవహిస్తోంది. పది సెంటీమీటర్లకు పైగా వర్షం వల్ల తిరుమలోని ఐదు డ్యామ్‌లు పూర్తిగా నిండాయి. నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు.
 
400 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట, చిట్టమూరు, దొరవారిసత్రం, కోట, వాకాడు, పెళ్లకూరు, ముత్తుకూరు మండలాల్లో అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేటలో 18.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 9 మండలాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో ఆయా మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గూడూరు వద్ద పంబలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. స్వర్ణముఖి నదికి నిండుగా నీరు చేరడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతాలు, ఖాళీ స్థలాలు జలమయమయ్యాయి. నగరంలోని కరెంటాఫీసు సెంటర్, అయ్యప్పగుడి, మన్సూర్‌నగర్, పొగతోట తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లు వాగులను తలపిస్తున్నాయి.

ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్‌ బ్రిడ్జిలు నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అ«ధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటిని యంత్రాలతో తోడేస్తున్నారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు ముందస్తు జాగ్రత్తగా గురు, శుక్రవారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 8 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 2 వేల హెక్టార్లలో వరినాట్లు, 50 హెక్టార్లలో వరినార్లు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆ నీరు కాలువల్లోకి వెళ్లి పోతుందని తెలిపారు. అల్లూరు, కావలి, నెల్లూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. గంటల వ్యవధిలోనే పునరుద్ధరిస్తున్నారు. 

నడి సంద్రంలో 12 మంది మత్స్యకారులు  
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాటిచెట్లపాళెంకు చెందిన 12 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి పడవ మరమ్మతుల కారణంగా వెనక్కి రాలేకపోవడంతో చిక్కుకుపోయారు. ఈ నెల 9న వారు కృష్ణపట్నంకు చెందిన మెకనైజ్డ్‌ బోటులో వేటకు వెళ్లారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తిరిగి వస్తుండగా బోటు గేర్‌ బాక్స్‌లో సమస్యలు తలెత్తడంతో మైపాడు తీరానికి సమీపంలో పడవ సముద్రంలోనే నిలిచి పోయింది. ఈ విషయాన్ని మత్స్యకారులు ఫోన్‌ ద్వారా అధికారులకు, రాష్ట్ర ఆఫ్కాఫ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబుకు సమాచారం అందించారు. కృష్ణపట్నంకు చెందిన కోస్ట్‌గార్డ్స్‌ ద్వారా మత్స్యకారులను తీరానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.   

వైఎస్సార్‌ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం 
వైఎస్సార్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చిట్వేల్‌ మండంలంలోని గొట్టిమానుకోన రిజర్వాయర్‌ నిండి అలుగు పారుతోంది. రాయచోటి నియోజకవర్గంలోని సుండుపల్లె – రాజంపేట దారిలో సుద్దకోళ్లవంక ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఆగిపోయాయి. మాండవ్యనది ఉధృతంగా ప్రవహిస్తోంది. రైల్వేకోడూరు ప్రాంతంలో గుంజనేరు, ముస్టేర్లు పొంగిపొర్లుతున్నాయి. వెలిగిళ్ల, గంగనేరు, పించా, ఝరికోన ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.రాయచోటి ప్రాంతంలోని సంచాలమ్మ గండిచెరువు, నూలివీడు వద్ద పెద్ద చెరువులు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రాజంపేట ప్రాంతంలోని హేమాద్రివారిపల్లెను నీరు చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఊటుకూరు పుల్లంగినేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అన్నమయ్య ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరి, పత్తి, మిరప, ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్లలో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వైవీయూ డిగ్రీ సెమిస్టర్‌ çపరీక్షలను వాయిదా వేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంతోపాటు కందుకూరు, చీరాల, సింగరాయకొండ, ఉలవపాడు, తీర ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. 27 మండలాల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తీవ్ర ప్రభావిత గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అనంతపురం జిల్లా హిందూపురం, ముదిగుబ్బ, గాండ్లపెంట, కదిరి, ఎన్‌పీకుంటలో ఓ మోస్తరు వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడుతోంది. 

తీరం దాటిన వాయుగుండం.. నేడు, రేపు భారీ వర్షాలు 
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్య ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా మధ్య తీరం దాటింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శుక్రవారం ఉదయం 6 గంటలకు తీవ్ర అల్పపీడనంగా బలహీన పడనుంది. అనంతరం మరింత బలహీనపడి అనంతపురం జిల్లా మీదుగా కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణించనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని సూచించారు. రాగల 48 గంటల పాటు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల ప్రత్యేక బృందాలను పంపినట్టు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు తెలియజేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top