గోబర్.. గాభరా ! | Heavy gas release in the digestive process of cattle | Sakshi
Sakshi News home page

గోబర్.. గాభరా !

Dec 17 2023 5:53 AM | Updated on Dec 17 2023 2:52 PM

Heavy gas release in the digestive process of cattle - Sakshi

ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ గ్యాస్‌ స్టవ్‌లొచ్చాయిగానీ కొన్నాళ్లు ‘గోబర్‌ గ్యాస్‌’ (పశువుల పేడతో తయారైంది) కూడా ఓ వెలుగు వెలిగింది!  గ్రామాల్లో పశు సంపద అధికంగా ఉండే ఇళ్లలో వీటిని బాగానే ఆదరించారు. చిన్నపాటి బావి  లాంటి గుండ్రటి ఇనుప డ్రమ్ముల్లో నిల్వ చేసిన  పేడ కరగడం ద్వారా నెమ్మదిగా మీథేన్‌ విడుదలవుతుంది. దీన్ని పైపు ద్వారా తరలించి వంటకు  వినియోగించడం తెలిసిందే. అంత చాకిరీ చేసే  ఓపిక లేకపోవడంతో కాల క్రమంలో గోబర్‌  గ్యాస్‌ కనుమరుగైంది. అలా వంటకు ఉపయోగపడ్డ మీథేన్‌ ఇప్పుడు వాతావరణంలో మంటకు కూడా కారణమవుతోంది!!  – పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌ 

వాహనాల పొగ, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల నుంచి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లకు మించి పశువుల నుంచి వెలువడే గ్యాస్‌ భూతాపానికి దారి తీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో, వాటి వ్యర్థాల నుంచి వెలువడే మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్నాయి. ఎంత ఆలస్యంగా జీర్ణం అయితే అంత ఎక్కువగా గ్యాస్‌ విడుదల అవుతుంది. కాబట్టి వాటికి తేలిగ్గా జీర్ణమయ్యే, సహజ సిద్ధమైన ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.  

నైట్రస్‌ఆక్సైడ్‌.. నిప్పుల కొలిమి 
కార్బన్‌డయాక్సైడ్‌ కంటే మీథేన్‌ గ్యాస్‌ 28 రెట్లు అధికంగా భూ తాపానికి కారణమవుతోంది. నిల్వ చేసిన పశువుల పేడ నుంచి అధిక మోతాదులో వెలువడే నైట్రస్‌ ఆక్సైడ్‌ బొగ్గు పులుసు వాయువు కంటే దాదాపు 265 రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కటానికి దారి తీస్తోంది. పశువులు తీసుకునే ఆహారంలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి కొంతవరకూ కారణం.

ప్రస్తుతానికి ఈ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టలేకున్నా మెరుగైన యాజమాన్య పద్ధతులు, పాల దిగుబడిని పెంచుకోవడం, దాణా­లో కొన్ని రకాల మందులను చేర్చడం ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. 2070 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యంగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం క్రమంగా ఊపందుకుంటోంది. సౌర విద్యుత్తు, గ్రీన్‌ హైడ్రోజన్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో గ్రీన్‌హౌస్‌ వాయువులను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత నెలకొంది.  

సమతుల్య ఆహారంతో.. 
అమెరికాలోని హోల్‌స్టీన్‌ ఆవులతో పోలిస్తే మన దేశంలో సంకర జాతికి చెందిన పశువులు 4.8 శాతం అధికంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇక దేశవాళీ ఆవులు 11.8 శాతం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టేందుకు 2030 నాటికి మీథేన్‌ఉద్గారాలను 11–30 శాతం వరకు నియంత్రించాలని, 2050 నాటికి 24–47 శాతం వరకు కట్టడి చేయాలని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సూచించింది.

3 ఎన్వోపీ (నైట్రాక్సీ ప్రొఫెనాల్‌)ను పశువులకు అందించే దాణాలో కలపడం ద్వారా మీథేన్‌ ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతున్నట్లు కన్సల్టేటివ్‌ గ్రూప్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌(సీజీఐఏఆర్‌) తాజా నివేదిక వెల్లడించింది. పశువుల ఆరోగ్యానికి ఇది సురక్షితమేనని సూచించింది. సంతులిత (సమతుల్య) ఆహారాన్ని ఇవ్వడం ద్వారా కూడా 15 శాతం దాకా ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని మరో సర్వే తెలిపింది.  

98 శాతం మీథేన్‌ వీటి నుంచే
1. వ్యవసాయం 
2. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 
3. బొగ్గు తవ్వకాలు 
4. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌
(ఘన వ్యర్థాల నిర్వహణ) 
5. వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌
(వ్యర్థ జలాల నిర్వహణ) 

స్వల్పంగా పెరిగినా మంటలే!  
♦ మీథేన్‌ ఎంత ఎక్కువగా విడుదలైతే పుడమి అంత అధికంగా వేడెక్కుతుంది.  
♦ ఉష్ణాన్ని బంధించి ఉంచే శక్తి కారణంగా మీథేన్‌ శాతం స్వల్పంగా పెరిగినావాతావరణంలో భారీ మార్పులకుదారి తీస్తుంది.  
♦ పశువులు తీసుకునే ఆహారం మీథేన్‌ విడుదలను ప్రభావితం చేస్తుంది.ఎక్కువ మొత్తంలో తీసుకోవడం, నాసిరకం మేతను ఇవ్వడం మీథేన్‌ విడుదలను పెంచుతుంది. 
♦  పశువుల ఆరోగ్యానికి చేటు చేయకుండా మీథేన్‌ విడుదలను నియంత్రించే టీకాపై న్యూజిలాండ్‌ పరిశోధన చేస్తోంది. 
♦  బ్రోమోఫార్మ్‌ లాంటివి పశువుల శరీరంలోని బ్యాక్టీరియా మీథేన్‌ ఉత్పత్తి చేయటాన్ని 65 శాతం వరకు తగ్గించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నా దీని వాడకానికి సంబంధించి పలు సందేహాలున్నాయి. పశువుల శరీరంలోకి చేరిన శైవలాలు (ఆల్గే) వాటి పాలు, మాంసం ద్వారా మనుషుల దేహంలోకి ప్రవేశించి థైరాయిడ్‌ గ్రంథి పనితీరును అస్తవ్యస్థం చేసే ప్రమాదం ఉందనే వాదనలున్నాయి. అందువల్లే అన్ని రకాల ఔషధాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేయడం లేదు.  

సంక్లిష్ట జీర్ణ ప్రక్రియ.. 
పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వాటిలో జీర్ణ ప్రక్రియ కొంత సంక్లిష్టంగా పొట్ట నాలుగు అరలుగా (రూమినెంట్స్‌) ఉంటుంది. పీచు పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మళ్లీ నోటిలోకి తీసుకొచ్చి నెమరు వేస్తాయి. తిన్న ఆహా రం కిణ్వ ప్రక్రియకు (పులవడం) గురైనప్పుడు మీథేన్‌ విడుదలవుతుంది. ఇది నోటి ద్వారా త్రేన్పులు రూపంలో, అపాన వాయువు రూపంలో వెలువడుతుంది. ఎంత తక్కువ సమయంలో ఆహారం జీర్ణం అయితే మీథేన్‌ ఉత్పత్తి అంత తగ్గిపోతుంది.

బోవర్, రెడ్సీ వీడ్, అగోలిన్, ఒరిగానో లాంటి వాటిని పశువుల మేత, దాణాలో కలిపి ఇవ్వడం ద్వారా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఎఫ్డీఏ ఆమోదించిన నైట్రాక్సీ ప్రొఫనాల్‌ను దాణాలో కలపడం వల్ల మీథేన్‌ శాతం బాగా తగ్గుతుంది. జొన్నలు, సజ్జలు తగినంత మోతాదులో అందిస్తే పీచు పదార్థాలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో ఇవ్వాలి.

ఇక పశువుల ఎరువును సరైన విధంగా నిల్వ చేయనప్పుడు నైట్రస్‌ ఆక్సైడ్‌ పెద్ద మొత్తంలో విడుదలవుతుంది. యాసిడ్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు పేడను ఆర్గానిక్‌ ఆమ్లాలుగా మారుస్తాయి. మీథేన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు దీన్ని మీథేన్, కార్బన్‌డయాక్సైడ్‌గా మారుస్తాయి. గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ వాతావరణం వేడెక్కడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పశువులకు సహజ సిద్ధమైన మేత, దాణా అందిస్తూ పాల దిగుబడి పెరిగేలా నాణ్యమైన జాతులను సాకాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement