రెప్పపాటులో ప్రమాదం.. కళ్లెదుటే బిడ్డ రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటుంటే

Guntur Nekarikallu Child Death Due To Lorry Accident - Sakshi

తల్లి కళ్లెదుటే బిడ్డ దుర్మరణం  

బాలుడిని బలిగొన్న మృత్యులారీ   

గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు  

అప్పటివరకు తన కొంగుపట్టుకుని చెంగుచెంగున నడిచిన బిడ్డ ఒక్కసారిగా వెనకపడేసరికి ఆ తల్లి ఉలిక్కిపడింది. బిడ్డ ఏడని చూసేలోగానే రెప్పపాటులో లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ మాతృమూర్తికి తీరని కడుపుకోత మిగిల్చింది. ఆరేళ్ల బాలుడిని నిర్ధాక్షిణ్యంగా బలితీసుకుంది. చిన్న కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్లెదుటే బిడ్డ రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటుంటే ఆ కన్నపేగు విలవిల్లాడిపోయింది. దిక్కులుపిక్కటిల్లేలా.. గుండెలవిసేలా.. రోదించింది. రాజుపాలెం మండలం నకరికల్లులో శుక్రవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందరి గుండెలను పిండేసింది.  

సాక్షి, గుంటూరు: రాజుపాలెం మండలం లక్ష్మీపురం తండాకు చెందిన  రమావత్‌ కొండానాయక్, దేవీబాయి దంపతులకు రాములునాయక్‌(6), లక్ష్మి ఇద్దరు కవల పిల్లలు. దేవీబాయి పుట్టిల్లు దాచేపల్లి మండలం భట్లుపాలెం తండాలో ఉంది. అక్కడ కార్తిక మాసం సందర్భంగా ఉత్సవాలు జరుగుతుండడంతో పిల్లలతో కలిసి బయలుదేరింది. వీరిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని రమావత్‌ కొండానాయక్‌ నకరికల్లులోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై దించాడు. ఆవలి వైపునకు వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉండడంతో దేవీబాయి పిల్లలు రాములునాయక్, లక్ష్మితో కలిసి రోడ్డు దాటేందుకు యత్నించింది. రోడ్డు దాటి డివైడర్‌ ఎక్కే సమయంలో అమ్మ కొంగుపట్టుకుని ఉన్న బాలుడు ఒక్కసారిగా వెనకపడ్డాడు.

ఏమైందని చూసేలోపే పిడుగురాళ్లవైపు నుంచి వచ్చిన లారీ రాములునాయక్‌ను ఢీకొట్టింది. దీంతో బాలుడి శరీరం ఛిద్రమైంది. అవయవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కళ్లెదుటే బిడ్డ దుర్మరణాన్ని చూసిన తల్లి గుండె తట్టుకోలేకపోయింది. పెద్దపెట్టున రోదించింది. రోడ్డు ఆవలవైపున ఉన్న తండ్రి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డ మృతదేహాన్ని చూసి బోరను విలపించాడు. క్షణం క్రితం వరకూ తమతో నవ్వుతూ ఊసులు చెప్పిన అన్న రోడ్డుపై విగతజీవిగా పడిఉండడం చూసి చెల్లి లక్ష్మి తల్లడిల్లింది.

కవలల్లో పెద్దవాడైన రాములునాయక్, తన చెల్లితో కలిసి తండాలో రెండోతరగతి చదువుతున్నాడు.  ప్రమాదం విషయం తెలుసుకొని తండావాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.సురేష్‌ తెలిపారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top