ఇష్టదైవానికి ఆన్‌లైన్‌లోనే పూజలు 

Growing demand‌ for Worship of God in online - Sakshi

ఆలయాల్లో ఈ–పూజలకు పెరుగుతున్న డిమాండ్‌  

ఒక్కరోజే 23 క్షేత్రాల్లో పూజలకు 512 మంది భక్తులు ఆన్‌లైన్‌లో హాజరు 

నెలాఖరు నాటికి 175 క్షేత్రాల్లో అందుబాటులోకి.. 

భక్తుల గోత్ర నామాలతో వారు వీక్షించేలా పూజలు.. పోస్టల్‌ ద్వారా ప్రసాదాలు 

మొత్తం 207 రకాల ప్రత్యేక పూజలను ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చేలా దేవదాయ శాఖ చర్యలు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వేళ గుడి వరకు వెళ్లకుండానే తమ ఇష్ట దైవాల పూజల్లో ఆన్‌లైన్‌ ద్వారా హాజరవుతున్నారు భక్తులు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్‌లైన్‌లో పూజాదికాలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవదాయ శాఖ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన శుక్రవారం రోజున రాష్ట్రంలోని 23 ఆలయాల్లో 512 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు దేవదాయ శాఖ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ క్షేత్రమైన మావుళ్లమ్మ ఆలయంలో శుక్రవారం అత్యధికంగా 159 మంది భక్తులు ఆన్‌లైన్‌ పూజల్లో పాల్గొనగా.. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయంలో ఒక్కరోజే  145 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా పూజలు నిర్వహించారు. ఈ నెల 8–11 తేదీల మధ్య 14 ఆలయాల్లో 624 మంది ఆన్‌లైన్‌ విధానాన్ని సద్వినియోగం చేసుకున్నారు.  

ప్రస్తుతం 23 క్షేత్రాల్లో.. 
రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన శ్రీశైలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, కాణిపాకం, మావుళ్లమ్మ మొదలగు 23 ఆలయాల్లో పరోక్ష పద్ధతిలో నిర్వహించుకునేలా ఈ–పూజలను దేవదాయ శాఖ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీ అధికంగా ఉండే 6 (ఏ) కేటగిరీలో ఉండే 175 ఆలయాల్లోనూ ఈ నెలాఖరు నాటికి ఆన్‌లైన్‌ పూజలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టింది. మరో 1,300 పైగా 6 (బీ) కేటగిరీ ఆలయాల్లోనూ జూలై చివరి నాటికి ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు.
 
భక్తులు వీక్షించేలా ప్రత్యేక లింకు 
వివిధ ఆలయాల్లో ఈ–పూజలను బుక్‌ చేసుకున్న భక్తులకు గోత్రనామాలతో కోరుకున్న పూజను ఆలయంలో నిర్వహించేలా దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుడు పూజను బుక్‌ చేసుకున్న వెంటనే అతడి మొబైల్‌ నంబర్‌కు ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్‌ లింకును ఆలయ అధికారులు పంపుతారు. నిర్దేశిత సమయంలో అధికారులిచ్చిన కోడ్‌తో భక్తుడు ఆన్‌లైన్‌లో లింకు ఓపెన్‌ చేయగానే.. సంబంధిత భక్తుల పూజను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. పూజల తరువాత ప్రసాదాన్ని పోస్ట్‌ ద్వారా పంపిస్తారు.  రాష్ట్రంలోని 170 ప్రముఖ ఆలయాల్లో ఈ–హుండీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

207 రకాల పూజలు 
వివిధ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలను మాత్రమే దేవదాయ శాఖ ఆన్‌లైన్‌లో పరిధిలోకి తెచ్చింది. త్వరలో 207 రకాల పూజలను ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతోంది.  
► శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో అభిషేకం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చంఢీ హోమం, నిత్య కల్యాణ పూజలను పరోక్ష సేవల కేటగిరిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఆన్‌లైన్‌ రూ.1,116 చెల్లించి ఏ పూజానైనా తమ గోత్రనామాలతో జరిపించుకోవచ్చు.  
► అన్నవరం ఆలయంలో మఖ నక్షత్రం రోజున అభిõÙకంతోపాటు అన్ని రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆన్‌లైన్‌ ద్వారా జరిపించుకోవచ్చు.  
► ద్వారకా తిరుమలలో శ్రీవారి నిత్య కల్యాణం (టికెట్‌ ధర రూ.1,600), బెజవాడ కనకదుర్గ ఆలయంలో చండీహోమం, ఖడ్గమాలార్చన, శ్రీకాళహస్తిలో రాహు–కేతు పూజలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించుకోవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top