
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం ఆరవ రోజు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో గత 46 నెలలుగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా మేలు చేశారంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు ప్రశంసించారు.
2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తమను మోసం చేశారని అన్ని వర్గాల ప్రజలు మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ తాము పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని నినదించారు. మళ్లీ వైఎస్ జగనే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు.
ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను అడిగి మరీ తీసుకుని ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్‌లకు అతికించుకుని అభిమానాన్ని చాటుకున్నారు.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఐదో రోజు ముగిసేటప్పటికి అంటే మంగళవారానికి వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 37 లక్షల కుటుంబాలకు చెందిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు 82960 82960 మిస్డ్ కాల్స్ ఇచ్చారు. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వానికి మద్దతు వెల్లువెత్తుతుండటం సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు దర్పణంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు సంప్రదాయక ఓటర్లుగా భావించే కుటుంబాల నుంచి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు లభిస్తుండటం విశేషం.