Akshaya Tritiya Gold Sales: అక్షయ తృతీయ అమ్మకాలు అంతంతే!

Gold Sales of Akshaya Tritiya 2022 Nominal - Sakshi

కార్పొరేట్‌ షాపులకే పరిమితమైన కొనుగోళ్ల సందడి

కోవిడ్‌ ముందు కాలంతో పోలిస్తే 30 శాతం తగ్గిన అమ్మకాలు 

పెరిగిన బంగారం ధరలకు తోడు వెంటాడుతున్న కోవిడ్‌ భయాలు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు అక్షయ తృతీయపై ఆశలు వదులుకున్న బంగారం వ్యాపారులు ఈ ఏడాది బంగారం అమ్మకాలకు పూర్వవైభవం వస్తుందని భావించారు. కానీ.. వారి ఆశలపై కొనుగోలుదారులు నీళ్లు చల్లారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అది ఉండేకొద్దీ అక్షయం అవుతుందన్న నమ్మకం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని బంగారం దుకాణాల్లో సందడి అంతంతమాత్రంగానే కనిపించింది. అక్షయ తృతీయ కొనుగోళ్లు కేవలం కార్పొరేట్‌ షాపులకు మాత్రమే పరిమితమైందని, మిగిలిన షాపుల్లో సాధారణ స్థాయిలోనే లావాదేవీలు జరిగాయని బులియన్‌ వ్యాపారులు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్‌ సమయంలో అక్షయ తృతీయ వచ్చినప్పటికీ కొనుగోళ్లు అంతగా లేవని, ఈ పండుగ సందర్భంగా బంగారం నిల్వలు పెంచుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదని ఏపీ గోల్డ్‌ డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్స్‌ ఉపాధ్యక్షుడు బూశెట్టి రామ్మోహనరావు ‘సాక్షి’కి తెలిపారు.  

నగరాలకే పరిమితం 
రాష్ట్రంలో 50 వేలకు పైగా బంగారం షాపులు ఉన్నప్పటికీ అక్షయ తృతీయ సందడి కేవలం విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి పట్టణాల్లో కార్పొరేట్‌ షాపులకు మాత్రమే పరిమితమైందని బులియన్‌ మర్చంట్స్‌ చెబుతున్నారు. గతంతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 30 శాతం క్షీణత కనిపిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, కోవిడ్‌ భయాలు ఇంకా వెంటాడుతుండటంతో భారీ కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేస్తుండటం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర ఒకానొక దశలో రూ.5,800 చేరి.. ప్రస్తుతం రూ.5,300 వచ్చినప్పటికీ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.  

సామాన్యుడు దూరంగా.. 
రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అక్షయ తృతీయ అమ్మకాలు కొద్దిగా పెరిగినప్పటికీ కోవిడ్‌ ముందు కాలం 2019తో పోలిస్తే అమ్మకాలు 30 నుంచి 40 శాతం తక్కువగానే నమోదైనట్లు విజయవాడలోని ఎంబీఎస్‌ జ్యూవెలరీ అధినేత ప్రశాంత్‌ జైన్‌ పేర్కొన్నారు. ఈ సారి కొనుగోళ్లకు మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు దూరంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్‌ భయాలు ఇంకా ప్రజలను వెంటాడుతుండటంతో మరో ఏడాదిన్నర వరకు బంగారం అమ్మకాలు ఇదే స్థాయిలోనే జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

వచ్చే రెండు నెలలు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వ్యాపారం జోరుగా సాగాల్సి ఉన్నా.. ఆ వాతావరణం కనిపించడం లేదని విజయవాడలోని ఆర్‌ఎస్‌ జ్యూవెల్స్‌ అధినేత లక్ష్మణ్‌ పేర్కొన్నారు. పెళ్లిళ్లు జరుగుతున్నా ఆ మేరకు బంగారం అమ్మకాలు జరగడం లేదన్నారు. అక్షయ తృతీయనాడు బంగారం కొనాలన్న సెంటిమెంట్‌ ఉన్న వాళ్లు ఒకటి రెండు గ్రాముల బంగారం నాణేలు కొనడానికి పరిమితమైనట్లు తెలిపారు. అక్షయ తృతీయ సందర్బంగా పత్రికా ప్రకటనలు, షాపుల అలంకరణకు భారీగా ఖర్చు చేసినా ఆ స్థాయిలో ఈ సారి అమ్మకాలు కనిపించలేదని ఒక కార్పొరేట్‌ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top