318.447 టన్నుల ఎర్రచందనం వేలానికి గ్లోబల్‌ టెండర్లు

Global tenders for above 318 tonnes of red sandalwood auction - Sakshi

పారదర్శకంగా, పోటీతత్వంతో ఇ–టెండర్‌ కమ్‌ ఇ–వేలం నిర్వహణకు ఆదేశాలు 

ఏప్రిల్‌ 9న మొదటి విడత వేలం

సాక్షి, అమరావతి: తన వద్ద మిగిలిన 318.447 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు పిలిచింది. అమ్మకం ప్రక్రియ పారదర్శకంగా, పోటీతత్వంతో జరిగేలా ఇ–టెండర్‌ కమ్‌ ఇ–వేలం నిర్వహణకు షెడ్యూల్‌ రూపొందించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. ఏప్రిల్‌ 9 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆన్‌లైన్‌లో మొదటి విడత వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో మిగిలిన ఎర్రచందనం నిల్వలకు ఏప్రిల్‌ 16న రెండో విడత, ఆ తర్వాత కూడా మిగిలితే ఏప్రిల్‌ 23న మూడో విడత ఇ–వేలం నిర్వహిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులను తెలిసేలా జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్లు, జర్నల్స్‌లో ఏపీఎఫ్‌డీసీ (ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఎండీ టెండర్‌ ప్రకటన ఇస్తారు. ప్రధానంగా చైనాలోని కొనుగోలుదారులకు తెలుసుకునేలా టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా, సాధ్యమైనంత ఎక్కువ మంది వేలంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన టెండర్‌ కమిటీ ఎర్రచందనం అమ్మకం ద్వారా ఎక్కువ లాభం వచ్చేలా చర్యలు తీసుకోనుంది. వేలం ప్రక్రియలో ఎంఎస్‌టీసీ సేవలను ఏపీఎఫ్‌డీసీ వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top