అమ్మాయిల ఐఐఠీవి

Girls Joining Iit Institutions Increases Year By Year Says Central - Sakshi

ఐఐటీల్లో ఏడేళ్లలో ప్రవేశాలు రెట్టింపు

2015లో చేరిన విద్యార్థినులు 9,450 

2020–21లో 20,228కి పెరుగుదల

ప్రత్యేక కోటాతో ప్రోత్సహిస్తున్న కేంద్రం

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో విద్యార్థినుల చేరికలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2014–15లో దేశవ్యాప్తంగా ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య 9,450 మాత్రమే కాగా 2020–21 నాటికి 20,228కి చేరుకుంది. దేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌ (స్టెమ్‌) విభాగాలలో యువతుల భాగస్వామ్యం 2017 నాటికి 14 శాతం ఉందని.. దీన్ని మరింత పెంచాలన్న నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థినుల చేరికలు పెరిగాయి.

2018 నుంచి అదనపు కోటా
ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సుల మేరకు 2018–19లో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో విద్యార్థినులకు 14 శాతం మేర ప్రత్యేక కోటా సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర వర్గాల  కేటాయింపులకు భంగం కలగ కుండా సూపర్‌ న్యూమరరీ కోటా కింద అదనంగా ఆ సీట్లను సిద్ధం చేసింది. అదనపు సీట్లను 2019–20లో 17 శాతానికి, 2020–21లో 20 శాతానికి పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అమ్మాయిల చేరికలు గతంలో కన్నా రెట్టింపు అయ్యాయి. గతంలో ఐఐటీల్లో 9,450 మాత్రమే ఉన్న విద్యార్థినుల సంఖ్య 2019–20 నాటికి 18,456కి పెరిగింది. 2020–21లో ఇది మరింత పెరిగి 20,228 మంది చేరడం గమనార్హం. ప్రత్యేక కోటా వల్ల ఐఐటీల్లో యువతుల చేరికలు 2018 నాటికి 18 శాతానికి పెరిగినట్లు వెల్లడైంది. ఐఐటీల్లో ఈ అదనపు కోటాను 8 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. 

ఇంటర్‌లో రాణిస్తున్నా..
మండి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ తిమోతి ఎ.గోన్సాల్వేస్‌ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించిన ప్రత్యేక కమిటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధిస్తున్న బాలికల శాతం 11 నుంచి 12.5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ఐఐటీ పరీక్షకు ప్రత్యేక తర్ఫీదు వారికి అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ఇంటర్‌లో విద్యార్థినులు మంచి ఫలితాలను సాధిస్తున్నా జేఈఈ, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో వెనుకంజ వేయటానికి కారణాలను  కమిటీ లోతుగా విశ్లేషించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top