పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ.. వాహనదారుల విలవిల | fuel shortage kurnool district west asia crisis | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ.. వాహనదారుల విలవిల

Apr 22 2026 1:23 PM | Updated on Apr 22 2026 1:25 PM

fuel shortage kurnool district west asia crisis

కర్నూలు(సెంట్రల్‌): పశ్చిమాసియా యుద్ధంతో ఓ వైపు గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో జిల్లా వాసులను పెట్రోల్, డీజిల్‌ కొరత వేధిస్తోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలో ఒక్కొక్కటి పెట్రోల్‌ బంకు మూత పడుతుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బంకుల ఎదుట నోస్టాక్‌ బోర్డులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వరకు బంకులు మూతపడడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆకస్మికంగా పెట్రోల్‌ బంకులు మూత పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు లేకపోవడంతో నో స్టాక్‌ బోర్డులు వెలిశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 132 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వాటికి సరాసరిగా రోజుకు లక్షన్నర లీటర్ల పెట్రోలు,  లక్షన్నర లీటర్ల డీజిల్‌ సరఫరా జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

అయితే ప్రస్తుతం రోజుకు పెట్రోల్‌  90 వేల లీటర్లు, డీజిల్‌ 90 వేల లీటర్లు మాత్రమే సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు అయ్యే సరఫరాలో కర్నూలు, ఆదోని ప్రాంతాలకు ఎక్కువ కేటాయింపు ఉంది. అయితే రూరల్‌ ఏరియాల్లో రోజురోజుకు స్టాక్‌ ఖాళీ కావడంతో పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, కర్నూలుతోపాటు పలు ప్రాంతాల్లో దాదాపు 50 బంకుల వరకు మూతపడ్డాయి. దీంతో ఆ ప్రాంత వినియోగదారులు పెట్రోల్, డీజిల్‌ కోసం అగచాట్లు పడుతున్నారు. స్టాక్‌ ఉన్న బంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలవాల్సి వస్తోంది.  

వారం రోజులుగా నిలిచిన సరఫరా.. 
మూత పడిన బంకుల్లో ఎక్కువగా హెచ్‌పీ, ఐఓసీ పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వారం రోజులుగా కడప నుంచి హెచ్‌పీ పెట్రో ఉత్పత్తుల సరఫరా జరగడం లేదు. దీంతో మూడు రోజులుగా జిల్లాలోని పలు బంకులు మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలులో కూడా హెచ్‌పీ బంకులు మూతపడ్డాయి. మూతపడిన జాబితాలో ఐఓసీ బంకులు ఉన్నా వాటి సంఖ్య తక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్‌ సరఫరాలో జాప్యాన్ని ముందే పసిగట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. జిల్లాలో పెట్రోల్, డీజిల్‌ కొరతే లేదని చెబుతున్నా అధికారులు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అధిక విని యోగం వల్లే కొరత అంటూ దాట వేస్తున్నారనే విమర్శ లు ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో అవసరం మేరకు పెట్రోల్, డీజిల్‌ సరఫరా జరగకపోతే మరికొన్ని పెట్రోల్‌ బంకులు మూత పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆయిల్‌ కంపెనీలతో మాట్లాడాల్సి ఉంది. లే దంటే ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  

ఇబ్బంది లేకుండా చేస్తాం 
జిల్లాలో చాలా చోట్లా పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. పత్తికొండ, ఆలూరు, కర్నూలులో మూతపడిన విషయాలు మా దృష్టికి రాలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎన్ని పెట్రోల్‌ బంకులు మూత పడ్డాయో వివరాలు తెప్పించుకుంటున్నాం. అససరం మేరకు పెట్రోల్‌ స్టాక్‌ ఉంది. అయితే ప్రజలే అవసరం కంటే ఎక్కువ గా వినియోగిస్తుండడంతోనే సమస్య ఉత్ప న్నం అవుతోంది. కాగా, మూతపడిన బంకుల కు రాత్రిలోపు పెట్రో ఉత్పత్తుల సరఫరా జరుగుతుంది. బుధవారం నుంచి ఇబ్బంది ఉండదు.   
– ఎం రాజారఘువీర్, డీఎస్‌ఓ, కర్నూలు  

స్టాక్‌ ఉన్న బంకుల్లో రద్దీ..  
చాలా చోట్ల పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు వెలుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు మూత పడుతుండడంతో స్టాక్‌ ఉన్న బంకుల వద్దకు వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్‌ కొరత భయంతో వాహనదారులు పరుగులు పెడుతున్నారు. అక్కడ గంటల కొద్ది క్యూలో నిలుచుని పెట్రోల్, డీజిల్‌ తీసుకెళ్తున్నారు. ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండలలో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement