పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా విశాఖలోని ఆర్‌టీసీ కాంప్లెక్స్ రోడ్డులో ఆటోను తాళ్లుతో కట్టి లాగుతున్న సీపీఎం నేతలు
విజయవాడలో రిక్షాకు బైక్ కట్టి రోడ్డుపై లాగుతూ వినూత్న నిరసన
తిరుపతి, కడప, విశాఖపట్నం, ఏలూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ధర్నాలు
రాష్ట్రవ్యాప్త నిరసనలకు వామపక్షాల పిలుపు
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై జనం ఒక్కసారిగా భగ్గుమన్నారు. శుక్రవారం ధరల పెంపును నిరసిస్తూ పలు చోట్ల అప్పటికప్పుడు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. సీపీఎం, సీపీఐలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడంతో అనేక ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతోపాటు పలు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ధర్నాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (వీఏటీ) తగ్గించి సామాన్యులకు ఊరట ఇవ్వాలని, ధరల పెరుగుదల వల్ల పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు వద్ద ధర్నా చేశారు. ఫ్లాట్ రిక్షాకు బైక్‌ను తాళ్లతో కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో విజయవాడ–బందరు ప్రధాన రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా రంగం కుదేలవుతుందని, నిత్యావసర సరకుల ధరలు పెరుగుతాయని, ప్రజలు, రైతాంగంపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రో ధరలు పెంచడం ప్రజలకు నమ్మకద్రోహం చేయడమేనని మండిపడ్డారు.
కృష్ణా జిల్లాలో రైతుల నిరసన
ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరుగుతాయని, ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నాగయలంకలో వారు నిరసనకు దిగారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో సీపీఐ శ్రేణులు రోడ్డుపై ఖాళీ గ్యాస్ సిలెండర్లు పెట్టి, తాళ్లతో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వైఎస్సార్ సర్కిల్ నుండి తిలక్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులోను వామపక్ష పార్టీలు పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ధర్నాలు చేశాయి. కడపలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాకినాడలో ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో లారీకి తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు.
నమ్మించి మోసం చేశారు..
పెట్రోల్, డీజిల్‌పై రూ.3కు పైగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం తగదని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు మూతపడి ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు.
ఇప్పుడు చమురు ధరలు పెంచడం వల్ల రవాణా రంగంపై పెనుభారం పడనుందని, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ బేసిన్‌లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇచ్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు నేతలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.


