‘సాల్ట్‌’ పేరిట ఉద్యోగాల వల

Fraud Under Name Of Supervisor Field Officer Posts Andhra Pradesh - Sakshi

ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణనిచ్చే సూపర్‌వైజర్, ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల పేరిట బురిడీ

విజయవాడలో ఆల్ఫాబెట్‌ వెంచర్‌ పేరిట రెండేళ్లుగా నిరుద్యోగుల నుంచి వసూళ్లు

రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో వేర్వేరు పేర్లతో సంస్థల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బాధితులు.. నిరుద్యోగులు లబోదిబో

ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణ

సాక్షి, విజయవాడ ప్రతినిధి/సాక్షి, అమరావతి: ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు వసూలుచేసి బోర్డు తిప్పేసిన బాగోతమిది. కేంద్ర ప్రభుత్వం ‘సాల్ట్‌’ అనే పథకాన్ని ప్రవేశపెడుతోందనీ, దీనిపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లను నియమిస్తున్నామంటూ బురిడీ కొట్టించి వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకుని మోసం చేసిన ఓ బోగస్‌ సంస్థ నిర్వాకమిది. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఇద్దరు బాధితులు విజయవాడలోని సంస్థ నిర్వాహకులను నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలివీ..

‘ఆల్ఫాబెట్‌ వెంచర్‌’ పేరుతో..
విజయవాడ సూర్యారావుపేటలోని వేమూరి వారి వీధిలో ‘ఆల్ఫాబెట్‌ వెంచర్‌’ పేరుతో రెండేళ్ల క్రితం ఓ సంస్థ వెలిసింది. ఎడ్యుకేషనల్‌ బుక్స్‌ పబ్లికేషన్, డిజిటల్‌ అండ్‌ ఆబ్జెక్టివ్‌ బేస్‌డ్‌ లెర్నింగ్, పేపర్‌ అండ్‌ పేపర్‌ ప్రోడక్ట్స్, ప్రింటింగ్‌ అండ్‌ రీ ప్రొడక్షన్, మోషన్‌ పిక్చర్‌ ప్రొడక్షన్, రేడియో అండ్‌ టెలివిజన్, స్టాఫింగ్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ, స్మార్ట్‌ లైటింగ్‌ సిస్టమ్, సీసీఎంఎస్‌–ఐఓటీ–కంప్యూటర్స్‌ అండ్‌ రిలేటెడ్‌ సేవల పేరుతో సంస్థను ఏర్పాటుచేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సర్వీసులను ఏజెన్సీలకు అప్పగిస్తాయని, ప్రభుత్వ కార్యకలాపాలను తమ సంస్థ ద్వారానే నిర్వహిస్తామని ఈ సంస్థ నిర్వాహకులు నిరుద్యోగులను నమ్మబలికారు. సంస్థ నెలకొల్పిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ‘సాల్ట్‌’ పథకానికి ఫీల్డ్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లను నియమిస్తున్నామని మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు వల వేశారు. దీంతో విస్సన్నపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి మానేసిన చిన్నం మృత్యుంజయ అనే వ్యక్తి ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులను ఆకర్షించాడు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు సాల్ట్‌ పథకంపై శిక్షణనిచ్చే కాంట్రాక్టును ‘ఆల్ఫాబెట్‌ వెంచర్‌’కు కేంద్ర ప్రభుత్వం అప్పగించిందనీ, ఇందుకుగానూ ఫీల్డ్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లను ఆ సంస్థ నియమిస్తుందని, 20 రోజుల శిక్షణ తరువాత నెలకు రూ.40 వేలు జీతం వస్తుందని అతను అందరినీ నమ్మించాడు. 

ఉద్యోగానికి రూ.4 నుంచి రూ.6 లక్షలు వసూలు..
ఇక ఫీల్డ్‌ ఆఫీసర్, సూపర్‌వైజర్‌ ఉద్యోగానికి ఒకొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలుచేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా విజయవాడలోని ఆల్ఫాబెట్‌ సంస్థ ప్రతినిధులు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోనే అనేకమంది నుంచి డబ్బులు వసూలుచేసినట్లు తెలుస్తోంది. చిన్నం మృత్యుంజయ ద్వారానే తమ నుంచి రూ. 8.20 లక్షలు వసూలు చేశారని ఇద్దరు బాధితులు చెబుతున్నారు.

వీరిరువురూ ఎంఏ, పీహెచ్‌డీ చేసి విస్సన్నపేటలోని ప్రైవేటు పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు. తాము గత ఏడాది సెప్టెంబర్‌లో డబ్బులు చెల్లించి 20 రోజులు శిక్షణ తీసుకున్నామని, ఆ తరువాత సంస్థ నిర్వాహకులు జీతం ఇవ్వకుండా మొహం చాటేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే..
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలా బోగస్‌ సంస్థలు వెలిశాయని బాధితులు చెబుతున్నారు. జిల్లాకు ఓ పేరుతో రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లోనూ ఏర్పాటుచేసి వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలుచేసినట్లు తెలుస్తోంది. ఏలూరులో ఆదిత్య మ్యాన్‌పవర్‌ సొల్యూషన్స్, కాకినాడలో మ్యాట్రిక్స్‌ మాన్‌పవర్‌ సొల్యూషన్, విశాఖపట్నంలో మరో పేరుతో సంస్థలను నెలకొల్పినట్లు బాధితుల కథనం. దీనిపై ఐసీడీఎస్‌ ఉద్యోగులను ఆరా తీస్తే.. తమ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని ఏజెన్సీకి అప్పజెప్పలేదని స్పష్టంచేశారు.

ఉద్యోగాల పేరిట మోసపోవద్దు
సమగ్రశిక్ష వొకేషనల్‌ ట్రైనర్‌ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దు. పాఠశాలల్లో వృత్తివిద్య కోర్సులు బోధించడానికి వొకేషనల్‌ ట్రైనింగ్‌ పార్టనర్స్, వొకేషనల్‌ ట్రైనర్లను నియమించుకుని పాఠశాలల్లో బోధిస్తారు. ఈ పోస్టులు పరిమిత కాలానికి మాత్రమే. కాబట్టి వీరి నియామకానికి సంబంధించి సమగ్రశిక్ష ఎటువంటి బాధ్యత వహించదు. ఇటువంటి వాటిపై ఫిర్యాదులను "vocational. apsamagra@gmail. com' కు మెయిల్‌ చేయాలి.
– ఎస్‌. సురేష్‌కుమార్, సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top