నేడు ‘పచ్చ తోరణం, వన మహోత్సవం’

Five crore plants plantation across Andhra Pradesh - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమం 

మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు బాలినేని, చెరుకువాడ 

అన్ని జిల్లాల్లో పాల్గొననున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు

సాక్షి, అమరావతి/మంగళగిరి: వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. ఈ సారి దాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

అక్కడ మొత్తం రెండు వేల మొక్కలను నాటతారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్‌ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖాధికారులు చెప్పారు. వర్షాకాలమంతా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్‌కుమార్‌ చెప్పారు.  

5 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు 
వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎయిమ్స్‌ ఆవరణలో సీంఎ వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ పచ్చదనంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, దానిని ప్రథమ స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి చెరుకువాడ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాక వాటిని పరిరక్షించాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొనే కార్యక్రమాన్ని కోవిడ్‌  నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ తదితరులున్నారు, జేసీ దినేష్‌కుమార్‌ తదితరులున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top