
అచ్యుతాపురం రూరల్ : పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి యర్రయ్య(26) సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం నలుగురితో కలిసి యర్రయ్య సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపలు పట్టడం కోసం తాడును చేతికి కట్టుకుని గేలంతో చేపలను కొట్టాడు.
ఈ క్రమంలో ఈ గేలానికి సుమారు 100 కేజీల బరువు ఉండే పెద్ద చేప చిక్కుకుంది. అయితే ఆ చేప బలంగా సముద్రంలోకి లాక్కుపోవడంతో యర్రయ్య గల్లంతైనట్టు తోటి మత్స్యకారులు తెలిపారు. తీరానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో వేట సాగించామన్నారు. అధికారులు స్పందించి గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలించాలని మత్స్యకార నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
