
జమ్మలమడుగురూరల్(అన్నమయ్య): ఇంటి ముందు పేడ నీళ్లు చల్లే విషయంలో జరిగిన చిన్న చిన్న పాటి గొడవ పెద్దదై పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. మండల పరిధిలోని పి. బోమ్మెపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. బొగ్గు గురులక్ష్మి తన ఇంటి ముందు పేడ నీళ్లు చల్లుకుంటూ ఉండగా కొన్ని నీళ్లు పక్కన నివాసం ఉంటున్న రాజచౌడయ్య ఇంటి వద్ద పడ్డాయి.
ఈ విషయమై ఇరువురి మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారు గాయపడ్డారు. గాయపడి వారిలో బొగ్గు నాగ అంజి, మహేష్, నాగేంద్ర, మల్లికార్జున, రామాంజనేయులు, గురులక్ష్మి, మరోవర్గంలో గూడెంచెరువు రాజ చౌడయ్య, సోమశేఖర్, పెద్ద చౌడప్ప, రమణమ్మ, రామ చౌడయ్య ఉన్నారు. రాజ చౌడయ్యకు తలపై బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు