
కష్టాల కడలిలో గోదా‘వర్రీ’ రైతు
కళ్లాల్లో కలిసిపోయిననాదెండ్ల మాటలు
అదనంగాఒక్క గింజ కొంటే ఒట్టు
దిక్కుతోచని స్థితిలో రబీ రైతులు
ప్రకృతి కన్నెర్రకు, కూటమి ప్రభుత్వ నిర్వాకం తోడవడంతో రబీ రైతులు కుదేలయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ సీజన్‌లో దిగుబడులు బాగున్నాయనుకున్న తరుణంలో ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం రైతన్నకు పెను శాపమైంది. ఎక్కడి ధాన్యం అక్కడే రోడ్ల పైన, కళ్లాల్లో ఉండిపోవడంతో అకాల వర్షాలకు తడిసి ముద్దయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్ సీజన్ ఆసన్నమై సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ఇంకా కళ్లాల్లో కనిపిస్తున్న తడిసిన ధాన్యం చూసి రైతులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తడిసిన ధాన్యంతో రైతులు రోడ్డెక్కి ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం అదనంగా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం మండలాలు సహా పలు ప్రాంతాల్లో కళ్లాల్లో ఉన్న తడిసిన ధాన్యం వద్ద ఫొటోలకు పోజులిచ్చారే తప్ప అదనంగా ఒక్క గింజ కొంటే ఒట్టని రైతులు మండిపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడ
జగన్ హయాంలో తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లు
రబీలో వరి కోతలు ముమ్మరంగా జరిగినప్పుడు ధాన్యాన్ని అక్కడక్కడ కొద్దోగొప్పో కొనుగోలు చేసిన ప్రభుత్వం.. వర్షాలు పడి తడిసి ముద్దయ్యే సరికి చేతులెత్తేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసి ఉంటే రబీ సీజన్ ముగుస్తున్నా రోడ్లపైన, కళ్లాల్లోను ధాన్యం కనిపించేదే కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ...
కాకినాడ జిల్లాలో రబీలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో రబీ సీజన్ చివరి దశకు వచ్చేసరికి 3.40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.
తూర్పు గోదావరి జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలనేది లక్ష్యం కాగా 2,63,076 మెట్రిక్ టన్నులతో లక్ష్యాలను అధిగమించామని కొనుగోళ్ళు ఆపేశారు.
కోనసీమ జిల్లాలో 5,86,616 మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా, రెండు లక్షల మెట్రిక్‌టన్నుల కొనుగోలుకు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.
ఆరబెట్టుకున్న
ధాన్యానికి..మొలకలు
గడచిన ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై ఆరబెట్టుకున్న ధాన్యం మొలకలెత్తడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక కొనుగోలు చేసిన కొద్దో గొప్పో ధాన్యం విషయానికి వస్తే, 75 కేజీల బస్తా ధాన్యం రూ.1,725కు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రచారార్భాటమే తప్ప క్షేత్ర స్థాయిలో రూ.1,250 మించి ఎక్కడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.
అటుకులు ఆడించుకోవాల్సిన దుస్థితి
ఆరబెట్టుకుంటుండగా కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి. కొనడానికి దళారులు కూడా రావడం లేదు. దిక్కుతోచని పరిస్థిథతుల్లో తడిసిన ధాన్యాన్ని అటుకులు ఆడించుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందనే భయమేస్తోంది. – టి.సత్యనారాయణ, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం
తక్కువ రేటుకైనా కొనడం లేదు
వర్షం కారణంగా రాశుల్లో ఉన్న దానితో పాటు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కనీసం తక్కువ రేటుకైనా కొనుగోలు చేసేందుకు ఏ కమీషన్ ఏజెంటూ ముందుకు రావడం లేదు. – కె.అప్పారావు, రైతు, అచ్చంపేట, సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా