
చిలకలూరిపేట: ఇప్పటి వరకు ట్రయల్ రన్‌లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో సీఎం వైఎస్ జగన్ పర్యటనపై శనివారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశానికే దిక్సూచిగా మారనుందన్నారు. ట్రయల్ రన్‌లో వేలాది మంది ఈ విధానం ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా పొందారని వెల్లడించారు.
ప్రతి 2,000 జనాభాకు ఒక విలేజ్ క్లినిక్ కేంద్రంగా ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం అమలవుతుందని వివరించారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా బృహత్తర వైద్య వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్‌సీలోనే ఉంటూ వైద్య సేవలు అందిస్తారని, మరొకరు 104 వాహనం ద్వారా ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఓపీ సేవలతో పాటు గర్భిణులు, నవజాత శిశువులు, బాలింతలు, రక్తహీనతతో పాటు వివిధ సమస్యలున్న రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారన్నారు.
నెలలో రెండుసార్లు వైద్యులు ఒక్కో గ్రామాన్ని సందర్శించి ఈ వైద్య సేవలను అందిస్తారని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న రోగులకు సంబంధించి వారి ఇళ్ల వద్దకే వెళ్లి డాక్టర్లు ఉచితంగా వైద్యం, మందులు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధరప్రసాద్, జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.