Fact Check: ‘అంగన్‌వాడీ’లకు ఫిబ్రవరి వరకు జీతాలిచ్చాం 

Fact Check: Eenadu Fake News On Anganwadi Salaries In AP - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ కార్యకర్తలకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ ‘ఈనాడు’ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమని మహిళా, అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాస్తవాలను వివరిస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జీతాలు చెల్లించామని వివరించారు. ఎవరికీ ఎటువంటి వేతన బకాయిలు లేవన్నారు.

2022–23 ఆర్థిక సంవత్సరానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు గౌరవ వేతనం కింద ఇప్పటివరకు రూ.1,019 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అంతేకాకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేసిన కార్యకర్తలకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున అందిస్తున్నామన్నారు. ఇందుకోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.27.80 కోట్లు విడుదల చేసినట్టు రవిప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. 

గత ప్రభుత్వం కంటే అధికంగా.. 
అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు గత ప్రభుత్వం కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అత్యధిక గౌరవ వేతనం ఇస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో గౌరవ వేతనంగా మొత్తం రూ.2,864.94 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.4,234.93 కోట్లకు పైగా వేతనాల కోసం వెచ్చించింది. అంతేకాకుండా అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.11,500, ఆయాలకు నెలకు రూ.7,000 చొప్పున అందిస్తోంది. 

అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలు ఇవి.. 
రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయకులకు ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కల్పించింది.
సెలవులు: అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతోపాటు కార్యకర్తలు, సహాయకులకు ఏడాదికి 20 రోజుల వార్షిక సెలవులను ప్రభుత్వం ఇస్తోంది. గరిష్టంగా రెండు పర్యాయాలు 180 రోజులపాటు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తోంది. గర్భస్రావం జరిగినప్పుడు 45 రోజులు సెలవు ఇస్తోంది. ఏటా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు 15 రోజులు వేసవి సెలవులు మంజూరు చేస్తోంది. 
చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

పదోన్నతులు: అర్హులైన అంగన్‌వాడీ వర్కర్లను సూపర్‌వైజర్‌ గ్రేడ్‌–2 పోస్టుల్లో నియమిస్తున్నారు. పరీక్ష ద్వారా 100 శాతం కోటాతో భర్తీ చేస్తున్నారు. అలాగే విస్తరణ అధికారి, గ్రేడ్‌ 2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి వయోపరిమితి 50 ఏళ్ల వరకు ఉండొచ్చని వెసులుబాటు కల్పిస్తూ 2021 డిసెంబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పదోన్నతులకు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచింది. 

బీమాతో ధీమా: ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ద్వారా 18 నుంచి 50 ఏళ్ల వయసు గల అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు రూ.2 లక్షల జీవిత బీమా సదుపాయం ఉంది. ఏదైనా కారణం వల్ల ప్రాణాపాయం, మరణం సంభవించినప్పుడు ఇది వర్తిస్తుంది. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీఐ) కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న కార్యకర్తలు, సహాయకులకు ప్రమాద మరణానికి, శాశ్వత వైకల్యానికి రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష బీమా వర్తిస్తుంది. అంగన్‌వాడీ కార్యకర్త బీమా యోజన (ఏకేబీవై) కింద 51 నుంచి 59 ఏళ్ల వయసు గల కార్యకర్తలు, సహాయకులు మరణిస్తే రూ.30 వేలు బీమా వస్తుంది. 

పదవీ విరమణ ప్రయోజనాలు: అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు గరిష్టంగా 60 ఏళ్లు వచ్చే వరకు పనిచేయవచ్చు. 60 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసే కార్యకర్తలకు రూ.50 వేలు, సహాయకులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top