వారు మారలేదు! 

Eye Of TDP Leaders On Government Lands - Sakshi

200 ఎకరాలకు పైగా కబ్జా

మినుము సాగుకు యత్నాలు

విలువ రూ.80 కోట్లు ఉంటుందని అంచనా 

వరికుంటపాడు: ఐదు సంవత్సరాలపాటు అధికారం చేతిలో ఉందని టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఇష్టారీతిగా ప్రవర్తించారు. రూ.కోట్ల విలువైన భూమిని ఆక్రమించి సాగుకు అనువుగా తీర్చిదిద్దారు. కొందరు నాయకులు ఇంకా అదే పంథాను కొనసాగిస్తున్నారు. వరికుంటపాడు మండలంలో కబ్జాపర్వం కొనసాగుతోంది 

మండలంలోని బొంగరాలపాడులోని సర్వే నంబర్‌ 45లో 1,250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.  
ఇందులో కొంత భూమిపై కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి.  
మరికొంత భూమి ఖాళీగా ఉంది. వాటిని తమకు పంపిణీ చేయాలని 20 ఏళ్లపాటు మండలంలోని తూర్పురొంపిదొడ్ల గ్రామానికి చెందిన ఎస్టీ, ఎస్సీలతోపాటు ఇతర కులాలకు చెందిన పేదలు అధికారులకు అర్జీలిచ్చినా పట్టించుకోలేదు.  
2009లో సదరు భూములను పేదలకు పంపిణీ చేయాలని అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నిర్ణయించారు.  
అర్హుల జాబితాను రూపొందించాలని అధికారులను కోరారు. ఆ తర్వాత పలు పరిణామాలతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. 
2010 సంవత్సరంలో అసైన్‌మెంట్‌ కమిటీలో ఈ భూమి పేదలకు పంపిణీ చేయాలని చంద్రశేఖర్‌రెడ్డి పట్టుబట్టినా, ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీలు కాలేదు.  
2014 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు భూ పంపిణీ ఆగిపోయింది.  
గత ప్రభుత్వ హయాంలోనే కొంతమేర భూమి ఆక్రమణకు గురైంది. ఇటీవలి కాలంలో మరింత ఆక్రమించారు. 
ఆక్రమిత భూముల విలువ రూ.80 కోట్ల ఉంటుందని అంచనా. 

తాజాగా.. 
కొండాపురం మండలం కోవివారిపల్లికి చెందిన కొందరు వ్యక్తులు సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పిచ్చిమొక్కలు, పొదలు తొలగించారు.  
దీంతో తూర్పురొంపిదొడ్ల గ్రామస్తులు నెలరోజుల క్రితం వరికుంటపాడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.  
వారు ప్రభుత్వ భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.  
అయినా లెక్క చేయకుండా ట్రాక్టర్ల ద్వారా భూమిని దుక్కి చేశారు. 
ఆక్రమణదారులు మినుము సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారని తూర్పురొంపిదొడ్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం 
బొంగరాలపాడులోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా దుక్కులు దున్నుతున్నట్లు తెలిసింది. ఈ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. హెచ్చరికలను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.
–  చొప్పా రవీంద్రబాబు, తహసీల్దార్, వరికుంటపాడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top