ఏలూరు ఘటనలో అంతుచిక్కని కారణం

Experts Scramble To Identify Elurus Mystery Disease - Sakshi

వ్యాధి నిర్ధారణపై తొలగని సందిగ్థం

ఏలూరులో కేసులు పూర్తిగా తగ్గుముఖం

సాక్షి, ఏలూరు: అంతుబట్టని అనారోగ్యం బారి నుంచి ఏలూరు కోలుకున్నా వ్యాధి నిర్ధారణ ఇంకా చిక్కుముడిగానే ఉంది. దీనిపై కేంద్ర బృందాలు ఇంకా ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి. మరోవైపు ఆరో రోజు గురువారం ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 14కి పరిమితమైంది. నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నా నిర్థారణ పరీక్షల ఫలితాల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏలూరులో బాధితులను పరామర్శించి అధికారులతో సమావేశం అయ్యారు. కేంద్ర బృందాలతో కూడా చర్చించారు.

బాధితుల్లో 24 గంటల అనంతరం సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ ఎయిమ్స్‌ నిపుణుల బృందం తెలిపింది. ఐఐసీటీ నిపుణులు కూడా వివిధ రకాల శాంపిళ్లు సేకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌వో) ప్రతినిధి బృందం ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేస్తూ నమూనాలు సేకరించింది. ఒకటి రెండు రోజుల్లో కచ్చితమైన నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిపుణుల బృందాలు చెబుతున్నాయి. ఏలూరులో తాగునీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, కలుషితం కాలేదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, విమ్టా ల్యాబ్‌ నివేదికలో వెల్లడైంది. 

హాని కలిగించే స్థాయిలో లేదు..
ఇప్పటివరకు 604 మంది బాధితులు ఏలూరు ఆస్పత్రిలో చేరగా 536 మంది డిశ్చార్జి అయ్యారు. 34 మందిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇద్దరు  వింత వ్యాధితో చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ ఖండించారు. ఏలూరు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇప్పటికే తాగునీటి విషయంలో పూర్తి స్పష్టత వచ్చిందని వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తాగునీటిలో ఆర్గానో క్లోరిన్‌ ఉన్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై స్పందిస్తూ ‘వైద్య పరిభాషలో ఎంజీ అంటే మిల్లీ గ్రామ్‌ కాదు. మైక్రోగ్రామ్‌గా భావించాలి. బాధితుల రక్త నమూనాల్లో లభ్యమైన ఆర్గానో క్లోరిన్‌ హాని కలిగించే స్థాయిలో లేదు’ అని తెలిపారు.  చదవండి: (బాబు హయాంలో అప్పుల తప్పులు: కాగ్‌ నివేదిక) 

రక్త నమూనాల్లో సీసం, ఆర్గానో క్లోరిన్స్‌!
►పరీక్షల కోసం సీఎఫ్‌ఎస్‌ఎల్‌ సహాయం కోరిన ఢిల్లీ ఎయిమ్స్‌
సాక్షి, న్యూఢిల్లీ: ఏలూరులో వింత వ్యాధికి కారణమైన మూలాలను కనుగొనేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌ మరింత లోతుగా పరిశోధనలు చేస్తోంది. ఏలూరులో సేకరించిన మరిన్ని రక్త నమూనాలను ఎయిమ్స్‌ వైద్యులు విశ్లేషించారు. మొత్తం 37 రక్త నమూనాలను విశ్లేషించగా.. అందులో 21 నమూనాల్లో అధిక మోతాదులో సీసం (లెడ్‌) ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మిగతా నమూనాల్లోనూ సీసం, నికెల్‌ వంటి భార లోహాలతోపాటు ఆర్గానో క్లోరిన్స్‌  (క్రిమిసంహారకాలు) కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో ఆర్గానో క్లోరిన్స్‌ పరీక్షల కోసం ఎయిమ్స్‌ వైద్యులు ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) సహాయం కోరారు. అయితే ఈ పరిశోధనల కోసం కేంద్ర హోంశాఖ నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు కావాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చొరవతో హోంశాఖ నుంచి రాతపూర్వక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆర్గానో క్లోరిన్స్‌ ఆనవాళ్ల కోసం సీఎఫ్‌ఎస్‌ఎల్‌ పరిశోధనలు చేస్తోంది. శుక్రవారం పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top