fact check: మేలెంచినా కీడెంచుతారా!? | Sakshi
Sakshi News home page

fact check: మేలెంచినా కీడెంచుతారా!?

Published Tue, Nov 28 2023 5:40 AM

enadu ramoji rao fake news sand mining andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపా­టిగా మారింది.

ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్‌చెక్‌’ ఏమిటంటే..

ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా?
రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది.

ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీ­లనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్‌ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..!

పేదలకు మేలు జరుగుతుంది..
నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్‌ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్‌ రుసుం, డీఎంఎఫ్, మెరిట్‌ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. 

ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు..
ప్రతి ఖరీఫ్‌ సీజన్‌కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు.

ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది?
ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్‌సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది.

ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం
పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్‌ స్క్వాడ్‌ తనిఖీలు, టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్‌ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం.

పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్‌ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం.     – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ 

Advertisement
Advertisement