4న రెండో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక

Election for second vice president posts on 4th January - Sakshi

దుగ్గిరాల మినహా మిగిలిన 649 మండలాల్లో ఎన్నికలు 

ఎంపీటీసీలకు సమాచారం

కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్‌ రెండో ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 4వ తేదీ మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫున ఎంపీడీఓలు ఇప్పటికే ఎంపీటీసీలకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రానికే పూర్తయిందని కమిషన్‌ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండల పరిషత్‌లో రెండో ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటుచేస్తూ ఇటీవలే అసెంబ్లీలో చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మినహా మిగిలిన 649 మండలాల్లో మండల పరిషత్‌ అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులతో పాటు కోఆప్టెడ్‌ సభ్యుని ఎన్నిక జరిగింది.

ప్రభుత్వ చట్ట సవరణ నేపథ్యంలో ఈ 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని డిసెంబరు 28న నోటిఫికేషన్‌ జారీచేశారు. దీంతో నాలుగో తేదీ ఉ.11 గంటలకు అన్నిచోట్లా మండల పరిషత్‌ ప్రతేక సమావేశాలు మొదలై, ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరోవైపు.. విశాఖ జిల్లా మాకవరం ఎంపీపీ రాజీనామాతో ఆ స్థానానికి కూడా అదే రోజున ఎన్నిక నిర్వహిస్తారు. అలాగే,  చిత్తూరు జిల్లా రామకుప్పం, గుర్రంకొండలో మండలాధ్యక్ష పదవులకు, కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో మొదటి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక  జరుగుతుంది. రాజీనామా కారణంగా ఖాళీగా ఉన్న కర్నూలు జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక కూడా మంగళవారం జరుగుతుంది. 

కోరం ఉంటేనే ఎన్నిక
మండల పరిషత్‌ రెండో ఉపాధ్యక్ష ఎన్నికవిధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. రెండో ఉపాధ్యక్ష ఎన్నిక నిమిత్తం జరిగే ప్రత్యేక సమావేశానికి కనీస కోరంగా మండల పరిషత్‌లో ఉండే మొత్తంలో ఎంపీటీసీ సభ్యుల సంఖ్యలో సగానికి పైగా సభ్యులు హాజరు తప్పనిసరని కమిషన్‌ స్పష్టంచేసింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి పరిధిలోని మండల పరిషత్‌ సమావేశాల్లో పాల్గొనవచ్చని, అయితే, వారికి ఎన్నికలో ఓటు హక్కు ఉండదని తెలిపింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top