మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు

Published Thu, Apr 28 2022 5:03 AM

Elderly associations similar to women thrift associations - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల మాదిరే ఇప్పుడు కొత్తగా వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ  సంఘాలకు ‘ఎల్డర్లీ స్వయం సహాయక సంఘాలు (ఈఎస్‌హెచ్‌జీ)’గా పేరు పెట్టారు. మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు రివాల్వింగ్‌ ఫండ్‌ రూపంలో ఆర్థికసాయం అందజేసినట్లే ప్రభుత్వం వృద్ధుల సంఘాలకు కూడా రెండేళ్లపాటు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నట్లే వృద్ధుల సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించే అవకాశం ఉంది. ఈ వృద్ధుల సంఘాల్లో.. 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఒకే సంఘంలోనే సభ్యులుగా కొనసాగవచ్చు. అయితే.. పురుషులు, మహిళల వేర్వేరు సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక సంఘంలో కనీసం పదిమంది, గరిష్టంగా 20 మంది సభ్యులుగా కొనసాగవచ్చు. కొండ ప్రాంతాలతోపాటు ఇతర గిరిజన ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుతనంతో ఉండే 12 కులాలకు చెందిన వారైతే కనీసం ఐదుగురితోనే సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత దశలో క్రమంగా రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలను విస్తరించనున్నారు.

మూడు విభాగాలుగా.. 
సంఘాల ఏర్పాటుకు వృద్ధులను మూడు విభాగాలుగా విభజించారు. 
1. తమ వ్యక్తిగత పనులు సొంతంగా చేసుకుంటూ, జీవనోపాధి కోసం ఇతర పనులు కూడా 
చేసుకునేవారు.
2.    తమ పనులు మాత్రమే చేసుకుంటూ, ఇంకేమీ చేయలేని వారు. 
3. వ్యక్తిగత పనులకు వేరే వాళ్లపై ఆధారపడే స్థితిలో ఉన్న వారు 
► ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మొదటి రెండు విభాగాల వారితో మాత్రమే సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 

ఈ సంఘాల ఏర్పాటు ఎందుకంటే..
► వృద్ధాప్యంలో కూడా వారు సమాజంలో గౌరవంగా జీవించేహక్కును ప్రోత్సహించడం. 
► కుటుంబ ఇబ్బందుల కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారి మనసు బాగుండేలా సంఘ సభ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహించడం.
► వృద్ధాప్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలపై పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా వారిలో అవగాహన పెరిగేలా చూడటం.

సాయం ఇలా..
► వృద్ధులు సొంత ఆదాయం పెంచుకోవడానికి ఆసక్తి చూపితే వారికి ఆసక్తి ఉన్న అంశంలో శిక్షణ ఇచ్చి ముందుకెళ్లేందుకు సంఘాల వారీగా బ్యాంకు రుణం ఇప్పించే అవకాశం ఉంది. 
► సంఘం ఏర్పాటు చేసినప్పుడు రూ. 5 వేలు, తర్వాత సభ్యులకు శిక్షణ కార్యక్రమాల సమయంలో రూ.5 వేలు, తొలి ఏడాది పెట్టుబడిగా మరో రూ.15 వేలు, రెండో ఏడాది రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది.


15 మండలాల్లో 3,017 సంఘాలు 
మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు కార్యకలాపాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలోనే పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. ఆ 15 మండలాల్లో ఈ ఏడాది ప్రాథమికంగా 3,017 సంఘాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 1,048 సంఘాలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు ప్రక్రియలో పాల్గొనే గ్రామ సమాఖ్య అసిస్టెంట్‌ (వీవోఏ)ల ద్వారానే వృద్ధుల సంఘాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. వృద్ధుల సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో బాధ్యులుగా ఉన్న ఒక్కొక్కరికీ శిక్షణ ఇవ్వగా, ఆ తర్వాత స్థాయిలో ఎంపికచేసిన మండల సెర్ప్‌ సిబ్బందికి, ఆయా మండలాల పరిధిలోని గ్రామ సమాఖ్యల సిబ్బందికి, వీవోఏలకు ప్రభుత్వం ఒక దశ శిక్షణను కూడా పూర్తిచేసింది. గ్రామాల్లో వీవోఏలు వృద్ధులను కలిసి సంఘాల ఏర్పాటు ఉద్దేశం వివరించి, సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement