విత్తన పరిశోధనకు మరో ముందడుగు  | Sakshi
Sakshi News home page

విత్తన పరిశోధనకు మరో ముందడుగు 

Published Mon, Feb 12 2024 5:11 AM

Dr ysr seed research for next kharif  - Sakshi

సాక్షి, అమరావతి: విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతోంది. కృష్ణాజిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసు­కురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది.  రైతులకు నాణ్యమైన సర్టీఫై చేసిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా.. దేశంలోనే తొలిసారిగా నియోజకవర్గ స్థాయి­లో వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ సర్టిఫై చేసిన విత్త­నాలనే మార్కెట్‌లోకి విడుదల చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా గ్రామ­­స్థాయిలో రైతులకు సరఫరా చేస్తోంది. మరోవైపు.. విత్తన పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబం­ధంగా రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేస్తోంది. ఈ తరహా పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో ఒక్క వారణాసిలో మాత్రమే ఉంది.

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రభు­త్వపరంగా ఈ తరహా పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రయత్నా­లు కూడా జరగలేదు. ఇప్పుడు గన్నవరంలోని విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల అంచనాతో తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గతేడాది మార్చిలో శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.18 కోట్లతో చేపట్టనున్న నిర్మా­ణాలకు పరి­పాలనామోదం ఇవ్వగా, ఏపీ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు.  

కొత్త రకాల విత్తనాలకు రూపకల్పన.. 
ఈ సంస్థ ఏర్పాటుతో రాష్ట్రంలో విత్తన నాణ్యత పరీక్షించే యంత్రాంగం బలోపేతం కానుంది. మానవ వనరుల అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సీడ్‌ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. వాతావర ణాన్ని తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల విత్తనాల రూపకల్పనతో పాటు సంకర జాతుల అభివృద్ధిలో ఈ సంస్థ భవిష్యత్తులో కీలక భూమిక పోషించనుంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థల సమన్వయంతో వ్యవసాయ పట్టభద్రులు, డిప్లమో హోల్డర్లకు కెపాసిటీ బిల్డింగ్‌ కింద శిక్షణ ఇవ్వనున్నారు. ఏటా కనీసం వెయ్యిమంది అగ్రి గ్రాడ్యుయేట్స్, రెండువేల మంది అగ్రి డిప్లమో హోల్డర్స్‌కు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

అత్యాధునిక సౌకర్యాలు.. 
ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రస్థాయి విత్తన జన్యు బ్యాంకుతో పాటు సీడ్‌ గ్రో అవుట్‌ టెస్ట్‌ ఫామ్, సీడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్, గ్రీన్‌ హౌస్, సీడ్‌ ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్‌ యూనిట్లు ఏర్పాటు 
కాబోతున్నాయి. అలాగే.. 
► విత్తనాలు నిల్వచేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మిస్తున్నారు.  
► రైతుల శిక్షణ కోసం ఫార్మర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిప్లమో చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించి ఈ రంగంలో 
పరిశోధనల వైపు అడుగువేసే వారికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చేందుకు ట్రైనింగ్‌ సెంటర్, హాస్టల్‌ భవన సముదాయాలు 
నిర్మిస్తున్నారు.  
► ఇప్పటికే పరిశోధనా సంస్థ భవన సముదాయంతో పాటు ట్రైనింగ్‌ సెంటర్‌కు సంబంధించి గ్రౌండ్‌ ఫ్లోర్, ఫస్ట్‌ ఫ్లోర్, హాస్టల్‌ బిల్డింగ్స్‌ నిర్మాణం పూర్తికావచ్చింది.  
► వచ్చే జూలై నాటికి వీటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. 

విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు 
రైతులకు అధిగ దిగుబడునిచ్చే నాణ్యమైన, మేలు రకం వంగడాలు అందించేందుకు విస్తృత పరిశోధనలు చేసే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం జగన్‌ సూచనల మేరకు డాక్టర్‌ వైఎస్సార్‌ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. సంస్థ సేవలు అందుబాటులోకి వస్తే విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోను న్నాయి.      – డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ

Advertisement
Advertisement