అద్దె జనం షో

Distribution Of Cash To People Attending Tirupati By Election TDP Campaign Meetings - Sakshi

అగ్రనేతల సభలకు రోజువారీ కూలితో తరలింపు

ఇతర నియోజకవర్గాల నుంచి తరలించిన వైనం

సభలకు హాజరైన జనానికి నగదు పంపిణీ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌  

సాక్షి, నెల్లూరు:  తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు విజయం చేకూర్చాలంటూ సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం ఉధృతం చేశారు. ఇప్పటికే ఒక్క అధికార వైఎస్సార్‌సీపీ అగ్రనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి మినహా మిగిలిన పార్టీల రాష్ట్ర, కేంద్ర స్థాయి అగ్రనేతలు ప్రచారం మమ్మురంగా చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు సాధ్యం కానీ హామీలతో జనాన్ని మాయ చేస్తున్నారు.

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ సభలను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకత్వం అష్టకష్టాలు పడుతోంది. ఓ వైపు మమ్మురంగా వరి కోతలు, వ్యవసాయ పనులు, ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు మండుటెండలు కాస్తున్నాయి. దీంతో పాటు ప్రధానంగా కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ విజృంభన చేస్తోంది. ఇన్ని రకాల కారణాల రాజకీయ సభలు, సమావేశాలకు జనం సమీకరించడం నియోజకవర్గ నేతలకు కష్టంగా మారుతోంది.

జనాన్ని తోలినా.. నిలవని వైనం 
ఉప ఎన్నికల్లో జన సమీకరణ కోసం టీడీపీ నేతలు కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రజల్లో పరపతి కోల్పోయింది. పారీ్టకి జనాధారణ కరువైంది. ఆ పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు మాజీ మంత్రుల పర్యటనలు విజయం చేయాలంటే స్థానిక నాయకత్వానికి చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది. టీడీపీ నేతల సభలు, సమావేశాలకు జనం పెద్దగా రావడం లేదు. రోడ్‌ షోలు వెలవెలపోతున్నాయి. దీంతో ఎలాగైనా జన సమీకరణ చేసి అగ్రనేతల ముందు పరువు నిలబెట్టుకునేందుకు జిల్లా నాయకత్వంతో పాటు నియోజకవర్గ నేతలు కుస్తీ పడుతున్నారు. ఇటీవల చంద్రబాబు పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించడంతో బరిలో నిలిచిన తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి జనాన్ని తీసుకుని రమ్మని నియోజకవర్గ నేతలు స్థానిక నేతలకు చెప్పడంతో ‘మా ఎన్నికలను బహిష్కరించిన చంద్రబాబు గొప్పల కోసం మేమెందుకు ఇంకా జెండాలు మోయాలని, మాకేం ఖర్మ’ అంటూ ముఖం చాటేశారు. రెండు రోజులుగా చంద్రబాబు పర్యటించిన సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో రోడ్‌షో విజయవంతానికి స్థానిక నాయకత్వం అరువు కూలీలను తెచ్చుకోవాల్సి వచ్చింది. అయినా కూడా సభలు ఆశించిన మేర సక్సెస్‌ కాలేకపోయాయి.

చంద్రబాబు సభలకు నియోజకవర్గంలోని స్థానిక నేతలు హాజరు పెద్దగా కనిపించలేదు. జిల్లా నలుమూలల నుంచి అరువు కూలీలను తరలించినట్లు తెలుస్తోంది. ఆ జనం ప్రసంగం పూర్తి కాకుండానే వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది. ఆ సభలకు హాజరైన జనానికి డబ్బులు పంచుతున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కూలీలను తెచ్చిన మేస్త్రీలకు ప్యాకేజీ ఇచ్చారంటా. ఇంతా చేసి చేతి చమురు వదిలించుకున్నా కూడా సభలు సక్సెస్‌ కాకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు స్థానిక నాయకత్వంపై గుర్రుమన్నట్లు సమాచారం.
చదవండి:
హవ్వా.. ఇదేమి విచిత్ర ప్రచారం    
‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top