పోలీసులు రాస్తున్న పెళ్లిపుస్తకం

Disha Police Station Counseling To Couple To Avoid Problems YSR District - Sakshi

సక్సెస్‌ ‘దిశ’గా మహిళా పోలీసు స్టేషన్‌

భార్యాభర్తల మనస్పర్థలు

‘కౌన్సెలింగ్‌’తో మటుమాయం

‘దిశ’యాప్‌ ద్వారా మహిళల రక్షణ

జీవితాంతం తోడు నీడగా ఉంటామని నవ దంపతులు చేసుకున్న పెళ్లినాటి ‘నాతిచరామి’ ప్రమాణాలను పక్కనపెట్టి చిన్నచిన్న మనస్పర్థలతో సంసారాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అనుమానాలు, అపార్థాలు, అసూయా ద్వేషాలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇంకొందరి విషయాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చురేపుతున్నాయి. ఫలితంగా విడాకుల వరకు వెళ్లి కాపురాలు కుప్ప కూలిపోతున్నాయి. కలహాల కాపురాలను  ‘కౌన్సెలింగ్‌’మంత్రంతో నిలబెడుతూ దంపతులకు ‘దిశా’ నిర్దేశం చేస్తున్నారు కడప మహిళా స్టేషన్‌ పోలీసులు.  –కడప అర్బన్‌  

ఇలా సరిచేశారు.. 
కడపకు చెందిన ఓ మహిళను ముంబైకి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇటీవల ఆ మహిళ తనను ఓ గదిలో నిర్బంధించి  చిత్రహింసలకు గురిచేస్తున్నారని తల్లికి సమాచారం ఇచ్చింది. స్థానికుల సలహా మేరకు బాధితురాలి తల్లి కడపలోని దిశ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి డీఎస్పీ షౌకత్‌ ఆలీకి ఫిర్యాదు చేసింది. ఆయన తమ సిబ్బందితో కలిసి బాధితురాలు చేసిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ముంబైలోని ఆ ప్రాంతం పరిధిలోని పోలీస్‌స్టేషన్‌ అడ్రస్‌ను సేకరించారు. పోలీస్‌స్టేషన్‌కు ఇక్కడి నుంచి ఫిర్యాదు చేస్తే వారు ఏసీపీని సంప్రదించాలని సూచించారు. ఆ అధికారి ఫోన్‌లో స్పందించకపోవడంతో ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే బాధిత మహిళకు విముక్తి కల్పించారు. కడప దిశ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుని వచ్చి భర్తకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో వారి సంసారం చక్కబడింది. అనంతరం బాధితురాలి తల్లి బంధువులతో ముంబైకి వెళ్లి, తన కుమార్తెను, అల్లుడిని చూసుకుని వచ్చారు. ‘‘బాధితురాలి తల్లి కష్టాన్ని తమదిగా భావించి సమస్యను పరిష్కరించామని’’డీఎస్పీ తెలియజేశారు.  

ఇద్దరినీ కలిపారు 
రాజంపేట పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఓ మండలానికి చెందిన యువతీ, యువకుడు పరస్పరం ప్రేమించుకున్నారు. యువకుడు తాను గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాని ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని చెప్పాడు. ఆమె ససేమిరా ఒప్పుకోకపోగా, తనను వెంటనే వివాహం చేసుకోవాలని కోరింది. మరోవైపు తనను ప్రేమించిన యువకుడు బంధువులకు చెందిన వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుండటంతో ఆమె పోలీసులను సంప్రదించింది. ఈ విషయంపై ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లోతుగా విచారించారు. వీరి మధ్య మనస్పర్థలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో వారి మధ్య సయోధ్య కుదిరింది. లేదంటే ఇద్దరు ప్రేమికులతో పాటు, మరో యువతి పేరును అనవసరంగా ప్రచారంలోకి తీసుకుని వస్తే.. ఆమె ఆవేదనకు గురైతే? ఆత్మహత్యలు లాంటి అనర్థాలకు దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు.  

అల్లుడి కోపం తగ్గింది.. సంసారం నిలబడింది 
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ అధ్యాపకుడికి, కడపకు చెందిన ఓ యువతికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. భర్తతో గొడవపడి, బాబును తండ్రి దగ్గరే వదిలేసి కడపకు వచ్చేసింది భార్య. భార్యకోసం భర్త కడపకు వస్తే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గొడవపడి బయటకు నెట్టేశారు. దీంతో వీరిమధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కొన్నిరోజులకు భార్య, తనకు కుమారుడు కావాలని, కనీసం వీడియోకాల్‌లోనైనా మాట్లాడించాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో చెప్పింది. వారు అల్లుడిమీద కోపంతో తమ కుమార్తె మాటలను ఖాతరు చేయలేదు.

దీంతో ఆమె దిశ మహిళా పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించారు. బోరున విలపిస్తూ తన కుమారుడిని, భర్తను కలపాలని ప్రాధేయపడ్డారు. స్పందించిన డీఎస్పీ ఆమె భర్తను, కుమారుడిని, బంధువులను పిలిపించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి వారి మధ్య మనస్పర్థలను తొలగించారు. దీంతో భర్త తన కుమారుడితో పాటు అత్తారింటికి వెళ్లాడు. మరుసటిరోజున భార్యాభర్తలు స్టేషన్‌కు వచ్చి ‘‘తమ సంసారాన్ని నిలబెట్టారని.. లేకుంటే జీవితాంతం విడిపోయేవారమని, సంతోషం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు’’తెలియజేశారు.   

ఒన్‌స్టాప్‌ (దిశ)సెంటర్‌ పాత్ర కీలకం  
జిల్లా స్త్రీ,శిశు సమగ్రాభివృద్ధి (ఐసీడీఎస్‌) పరిధిలో రిమ్స్‌ ఆవరణంలో నిర్మించిన ఒన్‌స్టాప్‌ సెంటర్‌(దిశ సెంటర్‌)లో ప్రాజెక్టు డైరెక్టర్‌ పద్మజ ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేటర్‌ ఎన్‌. అశ్విని, సైకాలజిస్ట్‌గా సునీత, న్యాయసలహాదారుగా ఉమాదేవి, ఇతర సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. వీరు తమ పరిధిలో భార్యాభర్తల కౌన్సెలింగ్‌ను విడతలవారీగా నిర్వహించి వారి మధ్య తలెత్తే విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top