
‘ఉపాధి’ జాబ్‌కార్డుల పంపకాల్లో తేడాలు.. బాహాబాహీకి దిగిన ‘మేట్లు’
బుక్కరాయసముద్రం: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి’ అన్నట్టు... అక్రమ ఆదాయం కోసం టీడీపీ కార్యకర్తలు అర్రులు చాస్తున్నారు. వారిలో వారే కలహాలు పెంచుకుని గొడవలకు దిగుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద దొంగ మస్తర్ల నమోదులో తేడాలు రావడంతో మేట్ల అవతారం ఎత్తిన ‘తమ్ముళ్లు’ ముష్టియుద్ధానికి దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల అవతారం ఎత్తి భారీఎత్తున దోపిడీకి తెరతీశారు.
పనులకు రాని వారి పేరుతో దొంగ మస్తర్లు సృష్టించి నిధులు కాజేస్తున్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు సురేశ్, బాలు, చితంబరి, నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి సీనియర్ మేట్లుగా ఉన్నారు. వీరిలో నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి, చితంబరి ‘ద్విసభ్య కమిటీ సభ్యుల’ వర్గీయులు కాగా.. బాలు, సురేశ్ ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులు. వీరికి జాబ్ కార్డుల పంపకాల్లో తేడాలు వచ్చాయి. తమ పరిధిలోని జాబ్ కార్డులపై ఎందుకు దొంగ మస్తర్లు తయారు చేస్తున్నారంటూ నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి, చితంబరి కలిసి ఎమ్మెల్యే వర్గీయులను ప్రశ్నించారు.
నివారం మండలంలోని రెడ్డిపల్లి వద్ద ఉపాధి పనులు జరుగుతుండగా అక్కడ పరస్పరం గొడవకు దిగి, కొట్టుకున్నారు. తర్వాత రెండువర్గాల వారు రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో పేరిట హంగామా సృష్టించారు. విషయం తెలుసుకున్న సీఐ పుల్లయ్య ఘటన స్థలానికి వెళ్లి వారిని చెదరగొట్టారు. ఐదుగురు సీనియర్ మేట్లనూ తొలగిస్తున్నట్లు ఎంపీడీవో సాల్మన్ తెలిపారు. కొత్తగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించే వరకు ఉపాధి పనులను నిలిపివేస్తున్నట్టు ఆయన చెప్పారు.