పాపికొండలు పర్యాటకానికి పచ్చజెండా 

Department of Tourism is making arrangements to resume Papikondalu boat services - Sakshi

ఈ నెలాఖరు నుంచి బోట్లు నడిపేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు 

పటిష్ట భద్రత మధ్య ప్రయాణం సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు 

బుట్టాయగూడెం: గోదావరి నదికి ఇరువైపులా కొండల మధ్య పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంత కనువిందు చేస్తోంది. పర్యాటకులకు మధురానుభూతినిచ్చే పాపికొండలు బోటు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి గత నెలలోనే బోటు ప్రయాణాలను ప్రారంభించేలా అధికారులు ఏప్రిల్‌ 15న బోటు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. కోవిడ్‌ రెండో దశ విజృంభించడంతో బోటు ప్రయాణాలకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పడుతుండటంతో జూన్‌ నెలాఖరు నుంచి బోటు సర్వీసులు నడిపేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పూర్తిగా తగ్గుముఖం పడితే.. కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తర్వాత సుమారు 19 నెలల పాటు ఆగిపోయిన బోటు సర్వీసులు తిరిగి మొదలవుతాయి. 

ప్రయాణం ఇక భద్రం 
కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. బోటు ప్రయాణాలు భద్రంగా సాగేలా పోలవరం మండలం సింగన్నపల్లి, వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క కంట్రోల్‌ రూమ్‌కు రూ.22 లక్షల నిధులను కేటాయించారు. బోటు ప్రయాణాలను పర్యవేక్షించేలా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలకు చెందిన సిబ్బందిని నియమించింది. ప్రయాణికులకు లైఫ్‌ జాకెట్లు సమకూర్చడంతో పాటు ప్రయాణ అనుకూల పరిస్థితి, బోటు కండిషన్‌ తదితర అంశాలను వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. గోదావరి నదిపై ప్రయాణించే బోట్లకు విధిగా సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంది. బోటు ప్రయాణించే లొకేషన్‌ను ఎప్పటికప్పుడు కంట్రోల్‌ రూమ్‌ ద్వారా తెలుసుకునేలా జీపీఎస్‌ అమర్చే ఏర్పాట్లు చేసింది.

ఏర్పాట్లు చేస్తున్నాం 
కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నెలాఖరుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ చేతుల మీదుగా బోటు సర్వీసులను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 
– ఏఎల్‌ మల్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఏపీ టూరిజం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top